శతాబ్దపు ఉత్పాతంగా బిల్‌గేట్స్ పేర్కొన్న కోవిద్ 19 ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షమందికి సోకి దేశ దేశాల సామాజిక ఆరోగ్య, ఆర్థిక రంగాల్ని అతలాకుతలం చేస్తోంది. ఆయా సమాజాల్లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్న దాఖలాలు లేవు కాబట్టి ఇప్పటికీ దాన్ని కట్టడి చేయగల అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వాసం వ్యక్తీకరిస్తున్నా- ఇండియా సహా ఎనభై దేశాలు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నాయి. కరోనా పురిటి గడ్డ అయిన జన చైనాలో దాని ఉద్ధృతి కాస్తంత నెమ్మదించినా ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్లలో అది మృత్యుభేరి మోగిస్తోంది. ఆ ప్రాణాంతక వైరస్ ఇటలీనుంచి 24 కేసుల రూపేణా 14 దేశాలకు, ఇరాన్‌నుంచి 97 కేసుల ద్వారా 11 దేశాలకు ‘రవాణా’ కాగా, ఇండియాలో నమోదైన మొత్తం 30 కేసుల్లో సగానికిపైగా ఇటలీ పర్యాటకుల పుణ్యమే! దేశవ్యాప్తంగా 21 విమానాశ్రయాలు, 12 భారీ, 65 చిన్న నౌకాశ్రయాల ద్వారా వచ్చే దేశ విదేశీ ప్రయాణికుల ఆరోగ్యాల్ని కూలంకషంగా పర్యవేక్షిస్తూ, సమీకృత వ్యాధి నిఘా కార్యక్రమం (ఐడీఎస్‌పీ) ద్వారా అన్ని రాష్ట్రాల్లోనూ రోగ లక్షణాలున్నవారిని కనిపెట్టేందుకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న ఏర్పాట్లు- సంక్షోభ తీవ్రతకు అనుగుణమైనవే.
శానిటైజర్లు, మాస్క్‌ల పంపిణీ
మురికివాడలనుంచి కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉందన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ హెచ్చరిక నేపథ్యంలో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం విస్పష్ట సూచనలు చేసింది. మురికివాడల్లో నివసించేవారి పరిశుభ్రత నిమిత్తం తగినంత నీటి సరఫరా, ఆ వాడల సమీపంలోనే చికిత్స కోసం ప్రత్యేక వార్డుల ఏర్పాటును ప్రతిపాదించిన హైకోర్టు- వారికి శానిటైజర్లు, దగ్గు, తుమ్ముల ద్వారా వైరస్ వ్యాపించకుండా మాస్కులనూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే అంశాన్ని పరిశీలించాలంది. చదరపు కిలోమీటరు పరిధిలో జన సాంద్రత చైనాలో 148, అదే ఇండియాలో 420. అంతకంటే ఎంతో అధికంగా జనసాంద్రతఉండే మురికివాడల్లో ఏ కొద్ది మందికి ఆ ప్రాణాంతక వైరస్ సోకినా ఏమవుతుందో తలచుకొంటేనే ఒళ్లు జలదరిస్తుంది. కోవిద్‌పై జరిగే యుద్ధంలో ప్రతి వ్యక్తినీ ఆత్మరక్షణ చేసుకోగల సుశిక్షిత సైనికుడిలా తీర్చిదిద్దడమే దేశ రక్షణకు భరోసా ఇవ్వగలుగుతుంది!
కరోనాలో ఏడు రకాలు...
ప్రపంచాన్ని చుట్టేస్తున్న మహమ్మారిగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ కోవిద్‌ను ఇప్పటికీ గుర్తించకపోయినా, అది ఇంకా పూర్తిగా ప్రజ్వరిల్లలేదన్న చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ వ్యాఖ్యలు భీతిల్లజేస్తున్నాయి. 80వేలపై చిలుకు కోవిద్ కేసులు నమోదైన చైనాలో మూడువేలమందికిపైగా మృత్యువాత పడగా, మరో ఆరువేలమంది ఆసుపత్రుల్లో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. అమెరికా సహా 26 దేశాల్లో కరోనా వైరస్ స్థానికంగానే కోరసాచిందని, తక్కిన దేశాల్లో వేరే చోట్లనుంచి దిగుమతి అయిందనీ అంటున్నారు. చైనా తరవాత అధికంగా మరణాలు నమోదైంది ఇటలీ (148), ఇరాన్ (107), దక్షిణ కొరియా (35)లే అయినా, అమేయ ఆర్థిక పుష్టిగల అమెరికానుంచి చిన్న దేశాల దాకా కరోనా పేరు వింటేనే భీతిల్లడానికి కారణం ఒక్కటే. మనుషులకు సంక్రమించే కరోనా వైరస్‌లో ఏడు రకాలు ఉండగా, అందులో నాలుగు నిరపాయకరమైనవైనా- తక్కిన మూడింటిలో సార్స్, మెర్స్ వైరస్‌ల ఉనికికి కొంత భిన్నంగా భీతిల్లజేస్తున్న కోవిద్ పనిపట్టే ఔషధం ఇంకా రూపొందక పోవడమే!