తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మైనారిటీల రక్షణ మరిస్తే తీవ్ర పరిణామాలే'

మతమరమైన మైనారిటీల రక్షణ తీవ్ర సమస్యగా పరిణమిస్తోందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలీజా రైస్​ ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో యూస్​ఐఎస్​పీఎఫ్​ రెండో వార్షిక సదస్సులో పాల్గొన్న ఆమె.. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య స్థాపన జరగాలని ఆకాంక్షించారు.

Condoleezza Rice

By

Published : Oct 22, 2019, 6:44 AM IST

Updated : Oct 22, 2019, 11:51 AM IST

ప్రపంచవ్యాప్తంగా మతపరమైన మైనారిటీల పరిస్థితిపై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలీజా రైస్​ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం(యూస్​ఐఎస్​పీఎఫ్) రెండో వార్షిక సదస్సులో పాల్గొన్న ఆమె.. ఇదో తీవ్రమైన సమస్యగా తయారైందని వ్యాఖ్యానించారు.

"ప్రపంచవ్యాప్తంగా మతపరమైన మైనారిటీల రక్షణ సమస్యగా మారింది. ఇదే మార్గంలో నడిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ప్రతీ నాయకుడు గుర్తించాలి."

-కండోలీజా రైస్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి

మతం నుంచి జాతీయ విధానాలను వేరు చేయాలని రైస్​ సూచించారు. సమాజంలో నిత్యం ఎన్నో సమస్యలు తయారవుతున్నాయనీ.. మతం వెనక పరుగెడితే అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంతో పరిష్కారం

సంప్రదాయ జాతీయవాదం, వాక్పటిమతో ఎందరో నాయకులు అధికారం పొందారని పరోక్షంగా రష్యా, చైనాలను ఉద్దేశించి రైస్​ విమర్శించారు. అంతటా స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యం విలసిల్లాలని ఆమె ఆకాంక్షించారు.

"ప్రజాస్వామ్యంలో గొప్ప విషయమేమిటంటే.. ప్రజా గళంతో ప్రభుత్వాలు, విధానాలు రూపొందుతాయి. కానీ అధికార వాద రాజ్యాల్లో ఏ విషయంపై అయినా తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాంటి సమయాల్లో దూరదృష్టి లేకుండా తప్పుడు విధానాలనూ అమలు పరిచే ఆస్కారం ఉంటుంది."

-కండోలీజా రైస్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి

భారత్​-అమెరికా సంబంధాలపై..

జార్జ్​ బుష్​ ప్రభుత్వంలో 2005-09 మధ్య విదేశాంగ శాఖ మంత్రిగా రైస్​ పనిచేసిన కాలంలోనే చారిత్రక భారత్-అమెరికా అణు ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో అమెరికా, రష్యా మధ్య ప్రస్తుత సంబంధాలు, భారత్​తో పాటు అంతర్జాతీయ సంబంధాలపై వాటి ప్రభావాలపై సుదీర్ఘంగా మాట్లాడారు రైస్.

హ్యూస్టన్​ సభలో అమెరికా-భారత్​ దేశాధినేతలు ఒక్కతాటిపైకి వచ్చినా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో సందిగ్ధ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఈ అంశంపైనా రైస్​ స్పందించారు. ఇరు దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవటంలో నేతలు విఫలమయ్యారని పేర్కొన్నారు.

ఆర్థిక విభేదాల పరిష్కారంతో..

ఈ ఏడాది జూన్​లో భారత్​కు ప్రాధాన్యాల సాధారణ వ్యవస్థ(జీఎస్పీ) హోదాను రద్దు చేసింది అమెరికా. భారత్​ కూడా 28 అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది.

"సాంకేతిక పరిజ్ఞానం, చమురు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాయి. భౌగోళిక రాజకీయ దృక్పథం, ప్రపంచ పరిణామ క్రమాన్ని మార్చే శక్తి వీటికి ఉంది."

-కండోలీజా రైస్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి

భారత్​, అమెరికా ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి రెండు దేశాలు ఇంకా ఎంతో చేయాల్సి ఉందని రైస్​ అభిప్రాయపడ్డారు. వాణిజ్య ప్రతినిధులు ఈ దిశగా ఒప్పందాలు చేసుకోవాలని ఆమె సూచించారు.

దిల్లీలో యూఎస్​ఐఎస్​పీఎఫ్​ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్​ ముకేశ్ అఘి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మొత్తం 300 మంది ప్రైవేటు రంగ ప్రతినిధులు, ప్రపంచ సంస్థల సీఈఓలు, భారత్​-అమెరికా ప్రభుత్వ నేతలు పాల్గొన్నారు.

భారత్​ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయ్​శంకర్​, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​, పరిశ్రమలు-రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్​ హాజరయ్యారు. అమెరికా తరఫున మాజీ విదేశాంగ మంత్రి డాక్టర్​ హెన్రీ కిస్సింజర్​, మాజీ దౌత్యవేత్తలు టిమోతీ రోయ్​మర్​, రిచర్డ్ వర్మ పాల్గొన్నారు.

(రచయిత-స్మితా శర్మ, సీనియర్​ పాత్రికేయురాలు)

Last Updated : Oct 22, 2019, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details