వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన అన్నదాతలకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు వారికి అండగా నిలుస్తున్నాయి. ఈ నెల 8న రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు మద్దతు ప్రకటిస్తూ ప్రధాన విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, గుప్కర్ కూటమి ఛైర్మన్ ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటనపై సంతకం చేశారు. రైతులు చేస్తున్న న్యాయబద్ధమైన డిమాండ్లను కేంద్రం పరిష్కరించాలని స్పష్టం చేశారు.
వ్యవసాయ చట్టాలు అప్రజాస్వామిక రీతిలో పార్లమెంట్ ఆమోదం పొందాయని నేతలు ధ్వజమెత్తారు. సరైన చర్చ, ఓటింగ్ జరగకుండానే ఆమోదించారని మండిపడ్డారు. ఈ చట్టాలు భారత్లో ఆహార భద్రతకు విఘాతం కలిగిస్తాయని ఆరోపించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని, రైతులను నాశనం చేస్తాయని అన్నారు. కనీస మద్దతు ధర రద్దుకు ఇవి బాటలు పరుస్తాయని, వ్యవసాయాన్ని పెద్ద కార్పొరేట్ల పరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.