సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో కరోనా కలకలంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. త్వరలోనే విచారణను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. దీనితోపాటు కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
సీఆర్పీఎఫ్కు చెందిన 31వ బెటాలియన్‌లో 137 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో ఆరుగురి ఫలితాలు రావాల్సి ఉంది. సీఆర్పీఎఫ్లో మొత్తంగా 146 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు కోలుకున్నారు.
ప్రధాన కార్యాలయం మూసివేత..
దిల్లీలోని సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని కూడా మూసివేశారు. ఇందులో పనిచేసే ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాలను తీవ్రంగా పరిగణించిన అధికారులు విచారణకు ఆదేశించారు. సీఆర్పీఎఫ్ చీఫ్ ఏపీ మహేశ్వరి నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.
అతని ద్వారానే..
సెలవులు పూర్తి చేసుకుని విధుల్లో చేరిన దిల్లీకి చెందిన కానిస్టేబుల్ ద్వారా బెటాలియన్‌లో వైరస్ వ్యాప్తి మొదలైందని అధికారులు అనుమానిస్తున్నారు. విధుల్లోకి చేరిన తర్వాత అతనిని 5 రోజులు క్వారంటైన్‌లోనే ఉంచారని తెలుస్తోంది. దీనిపైనా విచారణ కొనసాగుతోంది.