భాజపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఇండియా గేట్ వద్ద విద్యార్థుల నేతృత్వంలో జరుగుతున్న పౌరచట్ట వ్యతిరేక ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్ఆర్సీ పేదలకు వ్యతిరేకమని ఆరోపించారు. పేదలు తమ గుర్తింపుగా ఏ రుజువు చూపగలరని కేంద్రం లక్ష్యంగా ప్రశ్నాస్త్రాలు సంధించారు ప్రియాంక.
"దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పౌరచట్టం, దేశవ్యాప్త ఎన్ఆర్సీ ప్రాథమికంగానే పేదలకు వ్యతిరేకం. దీనివల్ల అత్యంత ఎక్కువగా పేదలపై భారం పడుతుంది. దేశాన్ని ఏ స్థితిలోకి నెట్టేస్తున్నారు. నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల ముందు లైన్లలో నిల్చోబెట్టిన విధంగా ఇప్పుడు ఎన్ఆర్సీ కోసం నిల్చునే పరిస్థితి వస్తోంది. ధనికులైతే పాస్పోర్ట్ చూపిస్తారు. కానీ పేదలు, రోజుకూలీలు ఏం చూపిస్తారు."