కాంగ్రెస్‌ను వీడి శివసేనలో చేరిన ప్రియాంక కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. వెంటనే శివసేనలో చేరారు. ముంబయిలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలిసి పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు.
ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ప్రియాంక. లోక్‌సభ ఎన్నికల టికెట్ ఇవ్వనందునే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
కొద్ది గంటల వ్యవధిలోనే..
ఉద్ధవ్‌ను కలిసేందుకు కొద్ది గంటల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపారు ప్రియాంక. తన ట్విట్టర్ ఖాతా 'బయో' నుంచి 'ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి' హోదాను తొలగించారు.
"ఎంతో బరువెక్కిన హృదయంతో నేను ఈ రాజీనామా లేఖ రాస్తున్నాను. పార్టీ సిద్ధాంతాలు నచ్చి ముంబయిలో పదేళ్ల క్రితం యువజన కాంగ్రెస్ సభ్యురాలిగా చేరాను. ఈ పదేళ్ల కాలంలో రాజకీయంగా ఎదిగేందుకు పార్టీ నాకు అన్ని అవకాశాలు కల్పించింది. నాకు అప్పగించిన బాధ్యతలను నేను 100 శాతానికంటే ఎక్కువ నిబద్ధతతో నిర్వర్తించాను. అయితే కొద్ది వారాలుగా జరిగిన సంఘటనలతో... నా సేవలు పార్టీకి అంత అవసరం లేదని, పార్టీలో నేను చివరి అంకానికి చేరానని అనిపించింది. పార్టీలో ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని అనిపించింది. నాపట్ల కొంత మంది పార్టీ కార్యకర్తలు అసభ్యకరంగా ప్రవర్తించారు. కానీ పార్టీ వారిపై కఠిన నిర్ణయాలేమీ తీసుకోలేదు. అది నాకు ఎంతో బాధ కలిగించింది. నా రాజీనామా పత్రానికి ఆమోదం తెలిపి... వెంటనే పార్టీ బాధ్యతల నుంచి నన్ను విముక్తిరాలిని చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను."
- ప్రియాంక చతుర్వేది లేఖ సారాంశం
కారణం ఇదే...
కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మధురలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రియాంక. ఈ సమావేశంలో కొంత మంది పార్టీ కార్యకర్తలు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటన అధినేతల దృష్టికి వెళ్లినందున పార్టీ పెద్దలు వీరందిరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈనెల 15న మళ్లీ వీరందరినీ పార్టీలోకి తిరిగి ఆహ్వానించడంపై ప్రియాంక మనస్తాపానికి గురయ్యారు.