'జాతీయ రహదారులపై ప్రైవేటు వాహనాలు, గగనమార్గంలో ప్రైవేటు విమానాలు పయనిస్తున్నప్పుడు.. మన రైలు పట్టాలపై ప్రైవేటు రైళ్లు ఎందుకు పరుగులు తీయకూడదు?'- 2012లో 'వైబ్రంట్ గుజరాత్' సదస్సులో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ లేవనెత్తిన ప్రశ్న ఇది. 2014లో మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టాక భారతీయ రైల్వే- ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించే దిశగా అడుగులు మొదలుపెట్టింది. 2019 అక్టోబర్ నాలుగో తేదీన లఖ్‌నవూ-దిల్లీ మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కించడంతో ఈ రంగంలో తొలి ప్రైవేటు రైలు ప్రయాణం మొదలైంది. ఆ తరవాత 2020 జనవరి 19న అహ్మదాబాద్-ముంబయి మధ్య రెండో ప్రైవేటు తేజస్ ఎక్స్‌ప్రెస్ పరుగులు మొదలు పెట్టింది. తొలి రెండు ప్రైవేటు రైళ్లను నడిపేందుకూ మోదీ ప్రభుత్వం పరోక్ష మార్గాన్నే ఎంచుకుంది. రైల్వేకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్‌సీటీసీ ఎలాంటి బిడ్డింగ్ లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వాములుగా ఉండగా, ఐఆర్‌సీటీసీ రైల్వేయేతర ఆపరేటర్‌గా పాల్గొంది.
కంపెనీల విశేష స్పందన
ఐఆర్‌సీటీసీ నిర్వహణలోని రెండు ప్రైవేటు రైళ్లు విజయవంతం కావడంతో, రైల్వేశాఖ జులైలో తదుపరి దశ కింద 151 ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికింది. ఇందుకోసం 109 మార్గాలను గుర్తించింది. దిల్లీ, ముంబయి, సికింద్రాబాద్, నాగ్‌పుర్, చెన్నై, హౌరా, బెంగళూరు, జైపుర్, పట్నా సహా పన్నెండు క్లస్టర్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంగా రూపొందించారు. భారతీయ రైల్వే తమ పట్టాలతోపాటు, డ్రైవర్లు, గార్డులు వంటి సిబ్బందిని సమకూరుస్తుంది. మిగతా సిబ్బంది ప్రైవేటు కంపెనీకి చెందినవారే ఉంటారు. ప్రైవేటు కంపెనీలు రైలు బోగీలు, ఇంజిన్లను ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. రుసుములను నిర్ణయించుకోవచ్చు. రైలును నిలపాల్సిన స్టేషన్లను ఎంచుకోవచ్చు. రైల్వేశాఖ నుంచి వచ్చిన ప్రైవేటు ప్రతిపాదనకు మంచి స్పందన వచ్చింది. దేశీయ, విదేశీ కంపెనీల నుంచి 120 బిడ్లు వచ్చాయి. స్పెయిన్‌కు చెందిన సీఏఎఫ్, జర్మనీ కంపెనీ సీమెన్స్ ఏజీ, అల్‌స్టెమ్ ట్రాన్స్‌పోర్ట్, ఎల్‌అండ్‌టీ, అదానీ గ్రూప్, జీఎంఆర్ గ్రూప్, వెల్‌స్పన్ ఎంటర్‌ప్రైజెస్, ఐఆర్‌బీ వంటి సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, ఐఆర్‌సీటీసీల నుంచి బిడ్లు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కేటాయింపులకు 2021 ఫిబ్రవరిని గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2023 మార్చి నాటికి 12 రైళ్లు, 2024 మార్చి నాటికి 45 ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఒక స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ (రెగ్యులేటర్)ను నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఈ విషయంలో భారతీయ రైల్వేలకు ఎలాంటి పాత్ర ఉంటుందనే విషయంలో స్పష్టత కరవైంది. ప్రస్తుతం రైల్వేమంత్రిత్వశాఖ విధాన రూపకర్తగా, అన్ని రైళ్ల నియంత్రణ సంస్థగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రైవేటు రైళ్లతో పోటీపడాల్సి వచ్చినప్పుడు ప్రయోజన వైరుద్ధ్యం తలెత్తకమానదు. అంటే- ఒక మార్గంలో పొగమంచు కారణంగా రెండు రైళ్లు ఆలస్యమైతే, అందులో ఒకటి ప్రైవేటు, మరొకటి రైల్వేశాఖదైతే, రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తేల్చుకోవడం నియంత్రణ వ్యవస్థకు అంత తేలికైన వ్యవహారమేమీ కాదు. ఇలాంటి సందర్భాల్లో ప్రైవేటు సంస్థ నిర్వాహకులు తమకే ప్రాధాన్యం దక్కేలా చేసుకునే అవకాశాలూ లేకపోలేదు.
తటస్థ వైఖరి సాధ్యమేనా?