2023 ఏప్రిల్ నుంచి ప్రైవేటు రైళ్ల కార్యకలాపాలు మొదలయ్యే అవకాశముందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ రైళ్ల ఛార్జీలు.. ఆయా మార్గాల్లోని విమాన ధరలతో సమానంగా ఉంటాయని తెలిపారు. "మేక్ ఇన్ ఇండియా" విధానంలోనే అన్ని బోగీలను కొనుగోలు చేయనున్నట్టు పేర్కొన్నారు.
ప్యాసింజర్ రైళ్లలో ప్రైవేటు భాగస్వామ్యంతో సాంకేతికపరంగా పెద్ద అడుగు పడినట్టు అయిందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. రైళ్ల వేగం కూడా భారీగా పెరుగుతుందన్నారు. అయితే రైళ్ల నిర్వహణలో లోపాలుంటే మాత్రం.. సంబంధిత ప్రైవేటు సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైల్వేను పూర్తి స్థాయిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నట్టు వస్తున్న వార్తలను వినోద్ ఖండించారు. ప్రస్తుతం ఉన్న 2,800 మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కేవలం 5శాతమని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణతో ప్రయాణికుల వెయిటింగ్ లిస్ట్ తగ్గుతుందని వివరించారు.
రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ ప్రక్రియను భారతీయ రైల్వే బుధవారం లాంఛనంగా ప్రారభించింది. 109 జంట మార్గాల్లో రైళ్ల నిర్వహణకు ఆర్ఎఫ్క్యూ(రిక్వెస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్)ను అందివ్వాలని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేలో ప్రైవేటు సంస్థలు రూ.30వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొంది.