తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సెక్యూరిటీ గార్డులకు ప్రత్యేక శిక్షణ తప్పనిసరి' - ప్రైవేట్​ సెక్యూరిటీ ఏజెన్సీ యాక్ట్​

దేశవ్యాప్తంగా ప్రైవేట్​ ఏజెన్సీలలో పనిచేస్తున్న భద్రతా సిబ్బంది, యజమానులకు ప్రత్యేక శిక్షణను తప్పనిసరి చేసింది కేంద్రం. సెక్యూరిటీ గార్డుల విధివిధానాలు, నిర్వర్తించాల్సిన బాధ్యతలపై 20 రోజుల ప్రత్యేక తరగతులకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.

Private security guards have to undergo 20 days training on crowd control, fire fighting
'ప్రైవేట్​ సెక్యూరిటీ గార్డ్​లకు 20రోజుల ప్రత్యేక శిక్షణ తప్పనిసరి'

By

Published : Dec 17, 2020, 5:43 PM IST

దేశవ్యాప్తంగా వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్​లు రద్దీ నియంత్రణ, అగ్నిమాపక నిర్వహణ, గుర్తింపు కార్డుల పరిశీలనలపై ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. 20 రోజుల ఈ కార్యక్రమంలో... 100 గంటలు తరగతి గది బోధన, 60 గంటల పాటు క్షేత్ర స్థాయి శిక్షణ నిర్వహించాలని పేర్కొంది. గతంలో సైనిక, పోలీసు విభాగంలో పనిచేసిన వారికి.. శిక్షణా కాలపరిమితిని కుదించింది హోం శాఖ. వారు 40 గంటల తరగతి గది పాఠాలతో పాటు ఏడు పనిదినాల్లో 16గంటల క్షేత్రస్థాయి శిక్షణకు హాజరు కావాలని సూచించింది.

ఈ శిక్షణా కార్యక్రమంలో శారీరక దృఢత్వం- రక్షణ, ఆస్తుల పరిరక్షణ, బిల్డింగ్​/అపార్ట్​మెంట్ భద్రత, విపత్తులు, ఆయుధాల నిర్వహణ సహా.. గుర్తింపు కార్డులు/పత్రాలను పరిశీలించడం వంటి వాటిపై శిక్షణ అందించనున్నారు.

ఏజెన్సీ యాజమానులకూ..

ప్రైవేట్​ ఏజెన్సీలను నిర్వహిస్తోన్న యజమానులకూ శిక్షణను తప్పనిసరి చేసింది కేంద్రం. వారు కూడా అంతర్గత భద్రత, విపత్తు నిర్వహణ వంటి అంశాలపై తర్ఫీదు పొందాలని సూచిస్తూ.. ఈ విధివిధానాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

ప్రైవేట్​ సెక్యూరిటీ ఏజెన్సీస్​(రెగ్యులేషన్​) యాక్ట్​-2005లోని సెక్షన్​ -24 ప్రకారం.. ఈ ఉత్తర్వులు జారీ చేసింది హోం శాఖ. ప్రైవేట్​ సెక్యూరిటీ ఏజెన్సీస్​ సెంట్రల్​ మోడల్​ రూల్స్​-2020గా పిలిచే ఈ నిబంధనల్ని అన్ని ఏజెన్సీలు తప్పనిసరిగా అమలు చేయాలని నోటిఫికేషన్​లో పేర్కొంది. ఈ మేరకు ఆయా ఏజెన్సీలలో నియామకం పొందిన సెక్యూరిటీ గార్డు లేదా ఏజెన్సీపై ఏవైనా నేరారోపణలు ఉంటే.. సంబంధిత లైసెన్స్​దారులు ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేసింది కేంద్రం.

దేశవ్యాప్తంగా సుమారు 90లక్షల మంది ప్రైవేట్​ సెక్యూరిటీ గార్డ్​లు ఉన్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది. వారిలో సైనిక, పోలీసు విభాగాల నుంచి వచ్చిన వారు సుమారు 30 లక్షల మంది వరకు ఉన్నారని పేర్కొంది.

ఇదీ చదవండి:'కారుణ్య నియామకాల్లో వివాహిత కుమార్తె అర్హురాలే'

ABOUT THE AUTHOR

...view details