తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోప్యత భద్రత రెండు కళ్లుగా.. 'సమాచార' రక్షణకు బిల్లు - telugu latest news on artificial intelegence

మన చుట్టూ రోజురోజుకూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. భవిష్యత్తులో ఇది మరింత విస్తరించే అవకాశమూ లేకపోలేదు. అయితే ఇలాంటి పరిణామాల మధ్య ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లనుందా?.. దేశంలో 80 కోట్లమందికి పైగా మొబైల్​ ఫోన్లను ఉపయోగిస్తున్నప్పటికీ, వ్యక్తిగత సమాచార భద్రత చట్టాన్ని తీసుకురావడంలో మాత్రం దేశం వెనకబడి ఉంది. ఇప్పుడు ఆ దిశగా ముందడుగు వేస్తోంది.

Privacy and security of public information has must be need... said experts
వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత రెండు కళ్లు

By

Published : Feb 9, 2020, 7:40 AM IST

Updated : Feb 29, 2020, 5:19 PM IST

ఇవాళ కంప్యూటర్లు, అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంటే- రేపు కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) విజృంభించబోతున్నాయి. వీటిని ఉపయోగించే ప్రజలు, సంస్థల సమాచారం (డేటా) వారికి తెలిసో, తెలియకో ఆయా పరికరాల్లో నిక్షిప్తమైపోతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని వ్యక్తులు, సంస్థల బ్యాంకు ఖాతాల్లో సొమ్మును, దేశాలు, సంస్థల సాంకేతిక, సైనిక సమాచారాన్ని కాజేసే దొంగలు ఎక్కువయ్యారు. ముఖాలను గుర్తించే సాంకేతికత (ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్‌) సాయంతో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఉద్యమకారులు, వేర్పాటువాదులకదలికలను కనిపెడుతూ, గీత దాటినవాళ్లను జైళ్లలో కుక్కుతోంది. ఇలా ప్రభుత్వాలు, అవాంఛనీయ శక్తులు పౌరుల సమాచారాన్ని సంగ్రహించి వారి జీవితాలను దుర్భరం చేయగలుగుతున్నాయి. దీన్ని నివారించడానికి భారత సుప్రీంకోర్టుతో సహా పలు దేశాలు పౌరులకు గోప్యత హక్కు ఉందని ప్రకటించాయి.

ఇంతవరకు 107 దేశాలు సమాచార భద్రతా చట్టాలను తీసుకురాగా, వాటన్నింటిలోకీ ఐరోపా సమాఖ్య (ఈయూ) చట్టం అత్యుత్తమంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికే 60 కోట్లమంది అంతర్జాలాన్ని, 80 కోట్లమంది మొబైల్‌ ఫోన్లను ఉపయోగిస్తున్నప్పటికీ, వ్యక్తిగత సమాచార భద్రత చట్టాన్ని తీసుకురావడంలో మాత్రం దేశం వెనకబడిఉంది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి శ్రీకృష్ణ కమిటీ 2018లో అందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ బిల్లును పార్లమెంటు సమ్మతి కోసం గత ఏడాది డిసెంబరు 11న ప్రవేశపెట్టారు. దానిపై తదుపరి పార్లమెంటు సమావేశాల్లో పూర్తిస్థాయి చర్చ జరగనుంది. వ్యక్తిగత సమాచార సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్‌లకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను ఈ బిల్లు నిర్దేశిస్తోంది.

డిజిటల్​ ఇండియాకు పునాది

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే ఇంధనం వ్యక్తిగత డేటాయే కాబట్టి కంపెనీలైనా, వేరెవరైనా ఆ సమాచారాన్ని వినియోగించుకోవాలంటే వ్యక్తుల సమ్మతి తప్పనిసరి అని డేటా భద్రత బిల్లు పేర్కొంటోంది. వ్యక్తిగత సమాచారాన్ని కీలక, సున్నిత, సాధారణ సమాచారంగా వర్గీకరించింది. డిజిటల్‌ సాధనాల్లో నిక్షిప్తమయ్యే వినియోగదారుల ఆర్థిక, ఆరోగ్య, బయోమెట్రిక్‌ సమాచారం, వారి రాజకీయ, మతపరమైన విశ్వాసాలను సున్నిత సమాచారంగా పరిగణిస్తోంది. ఈ తరహా డేటాను భారత గడ్డపైనే భద్రపరచాలని, స్పష్టమైన సమ్మతి ఉంటే విదేశాల్లో ప్రాసెస్‌ చేయవచ్చని నిర్దేశిస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని కీలక సమాచారంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొన్ని రకాల డేటాను కీలక సమాచారంగా ప్రకటిస్తూ ఉంటుంది. దాన్ని మాత్రం భారత్‌లోనే నిల్వ చేసి ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది. ఇక సాధారణ సమాచారాన్ని నిర్నిబంధంగా ఎక్కడైనా నిల్వచేసి ప్రాసెస్‌ చేయవచ్చు. వినియోగదారుల సమ్మతి లేకుండా వారి సమాచారాన్ని ఉపయోగించుకునే సంస్థలు తమ అంతర్జాతీయ టర్నోవరులో నాలుగు శాతాన్ని లేదా రూ.15 కోట్లను జరిమానాగా చెల్లించాల్సి వస్తుంది.

అనధికారికంగా సమాచారాన్ని సంగ్రహించినా, వెల్లడి చేసినా అయిదు కోట్ల రూపాయలు లేదా రెండు శాతం అంతర్జాతీయ టర్నోవరును జరిమానాగా చెల్లించకతప్పదు. బాలల సమాచారాన్ని సేకరించి, విశ్లేషించే సంస్థలు అందుకు తల్లిదండ్రులు లేక సంరక్షకుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. బాలల వయసును నిర్ధారించుకోవాలి. బాలబాలికలకు ప్రత్యేకించిన సేవలను అందించే సంస్థలు వారి కార్యకలాపాలపై నిఘా పెట్టకూడదు. వారి అలవాట్లు, స్వభావాలను అంచనా కట్టే సాంకేతికతలను ఉపయోగించకూడదని బిల్లు శాసిస్తోంది. పౌరుల సున్నిత సమాచారాన్ని కంపెనీలు వినియోగించుకోవడంపై ఆంక్షలు విధిస్తున్న బిల్లు ప్రభుత్వానికి మాత్రం ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్రజా ప్రయోజనాల కోసం, దేశ సార్వభౌమత్వ పరిరక్షణ కోసం ప్రభుత్వం పౌరుల సమ్మతి లేకుండానే వారి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించవచ్చునని నిర్దేశిస్తోంది. దీని అమలుకు కేంద్రం సమాచార భద్రత సంస్థను ఏర్పాటు చేస్తుంది. మన సమాచార భద్రత బిల్లు రెండువైపులా పదునైన కత్తిలాంటిదనడంలో సందేహం లేదు. ఒకవైపు అది భారతీయులకు వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కును ప్రసాదిస్తున్నా, రెండో వైపు ఆ గోప్యతను ఉల్లంఘించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతోంది.

వస్తుసేవల క్రయవిక్రయాలు, నగదు జమలు, చెల్లింపులు, విద్యాబోధన, అభ్యాసాలు, అధికార, సైనిక, వ్యాపార కార్యకలాపాలు అంతర్జాలంలో జోరందుకుంటున్న నేపథ్యంలో డిజిటల్‌ ఇండియా ఆవశ్యకత తెలిసివస్తోంది. దానికి గట్టి పునాది వేయడానికే కేంద్రం వ్యక్తిగత సమాచార భద్రత బిల్లును తీసుకొచ్చింది. అంతర్జాల అంకుర సంస్థల వ్యాపార నిర్వహణకు ఈ బిల్లు ఒక దిక్సూచిలా ఉపయోగపడినా గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, బైట్‌ డాన్స్‌, ట్విటర్‌, టిక్‌ టాక్‌ వంటి సువ్యవస్థిత సంస్థలకు మాత్రం కొత్త సవాళ్లు విసరుతోంది. ఇకపై అవి భారతీయుల సమాచారాన్ని ఉపయోగించే తీరుపై ఆంక్షలు విధిస్తుంది. భారతదేశంలో అంతర్జాల ప్రకటనల ద్వారా గూగుల్‌ ఏటా 100 కోట్ల డాలర్లు ఆర్జిస్తోంది. ప్రతి నెలా 21.7 కోట్లమంది ఫేస్‌బుక్‌ను వీక్షిస్తుంటారు. వాట్సాప్‌ను 40 కోట్లమంది భారతీయులు ఉపయోగిస్తున్నారు. ఈ వినియోగదారుల సమాచారానికి టెక్‌ కంపెనీలు జవాబుదారీ కావాల్సి ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచార పంపిణీ 30మంది వ్యక్తుల మరణానికి దారితీసిన దృష్ట్యా వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు కొన్ని జాగ్రత్తలను సూచిస్తోంది.

నిరంతర నిఘా

ఈయూ చట్టం నుంచి భారత్‌ స్ఫూర్తి పొందుతున్నట్లు అనిపించినా, ఇండియా సమాచార భద్రత బిల్లులో చైనా తరహా నిరంకుశ పోకడలు కనిపిస్తున్నాయని విమర్శలు వచ్చాయి. భారత్‌ ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేనంత విస్తృత ముఖ గుర్తింపు కార్యక్రమాన్ని రూపొందించే పనిలో నిమగ్నం కావడం ఈ విమర్శలకు బలమిస్తోంది. పౌరుల నిత్యకృత్యాలను ప్రభుత్వం నిరంతరం గమనిస్తే వచ్చే అనర్థాలను జార్జ్‌ ఆర్వెల్‌ అనే బ్రిటిష్‌ రచయిత ‘1984’ అనే నవలలో కళ్లకు కట్టారు. ఆయన హెచ్చరికను చైనా ఇప్పటికే నిజం చేసింది. భారత్‌ కూడా అదే బాటలో ఉంది. సీసీటీవీ వీడియోలు, వార్తాపత్రికలు, పాస్‌పోర్ట్‌ ఫొటోలు, నేర రికార్డులు, మొబైల్‌ యాప్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేసిన ఫొటోల్లోని వ్యక్తుల ముఖాలను గుర్తించే కార్యక్రమానికి జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల ‘బిడ్‌’లకు దరఖాస్తులు ఆహ్వానించింది. నేరస్తులను వెంటనే పట్టివేయడానికి, అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ కనిపెట్టడానికి, అనాథ మృతదేహాలపూర్వాపరాలను నిర్ధారించడానికి ఇలాంటి కార్యక్రమం అవసరమని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి లక్ష జనాభాకు 144 మంది పోలీసులు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యల్ప నిష్పత్తి అని ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది. పోలీసు బలగాన్ని పెంచాలంటే నిధుల కొరత అడ్డువస్తోంది కాబట్టి, సాంకేతికత సాయంతో సమస్యను అధిగమించాలని ఎన్‌సీఆర్‌బీ ప్రయత్నిస్తోంది. గత ఏడాది జులైలో కొన్ని విమానాశ్రయాల్లో ముఖ గుర్తింపు సాంకేతికతను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. కనిపించకుండా పోయిన బాలల్లో మూడు వేలమంది ఆచూకీని దీని సాయంతో కొద్ది రోజుల్లోనే కనిపెట్టగలిగామని దిల్లీ పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ సాంకేతికతను పౌరులపై నిఘాకు ఉపయోగించే ప్రమాదమూ ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నదృష్ట్యా టెండరు ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఆధార్‌, ఈ-కామర్స్‌, సామాజిక మాధ్యమాల ద్వారా పౌరుల ఫొటోలు, వ్యక్తిగత సమాచారం సులువుగా లభ్యమవుతున్న ఈ రోజుల్లో వ్యక్తిగత సమాచార భద్రత చట్టాన్ని, ముఖ గుర్తింపు సాంకేతికతను పకడ్బందీగా, నేర్పుగా మేళవించాలి. పౌరుల గోప్యతా హక్కుకు భంగం కలగని రీతిలో వీటిని ఉపయోగించాలి.

పకడ్బందీగా చట్టం

తమ సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు పౌరులకు ఉందని, దాన్ని ఇతరులు దొంగిలించకుండా, దుర్వినియోగం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్ని ప్రజాస్వామ్య దేశాలూ గుర్తిస్తున్నాయి. సమాచార గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ డేటా భద్రత చట్టాలను తీసుకొస్తున్నాయి. 2018లో ఈయూ అలాంటి చట్టమే చేసింది. దాన్ని అతిక్రమించే సంస్థలు తమ వార్షిక అంతర్జాతీయ టర్నోవరులో నాలుగు శాతాన్ని లేదా రెండు కోట్ల యూరోలను జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ చట్టంలోనూ అలాంటి నిబంధనలను పొందుపరచారు. భారతదేశంలో సామాజిక మాధ్యమాలను, చెల్లింపు వ్యాలెట్లను, బ్యాంకింగ్‌ యాప్‌లను, ఈ-కామర్స్‌ పోర్టళ్లను వినియోగించేవారు నానాటికీ పెరిగిపోతున్నారు. ఈ అంతర్జాల (డిజిటల్‌) వినియోగదారులు ఎంతసేపటికీ లాభసాటి బేరాల కోసం, తమ సామాజిక పరిచయాలను పెంచుకోవడం కోసం వెంపర్లాడుతున్నారే తప్ప- ఈ క్రమంలో తమ సమాచారాన్ని దుర్వినియోగపరచేవారు పొంచి ఉన్నారని గ్రహించడం లేదు. తాము వాడి పారేసిన స్మార్ట్‌ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు, మెమరీ కార్డుల్లోని సమాచారం చెరిగిపోదని, దాన్ని కూడా ఇతరులు ఉపయోగించుకోగలరనే స్పృహ వారికి ఉండటంలేదు. వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయనుంది.

-వరప్రసాద్​

Last Updated : Feb 29, 2020, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details