'ఆత్మనిర్భర భారతంతో ఆరోగ్య భారత్'
74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్రకోట వేదికగా సుదీర్ఘంగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆత్మనిర్భర భారత్, ఆరోగ్య భారత్ సహా.. లద్దాఖ్ ఘటన, అయోధ్య భూమిపూజ, ఆరేళ్లలో సాధించినవి, జల్‌జీవన్ మిషన్, సంస్కరణలు, ప్రాజెక్టులు, కరోనాపై పోరాటం, వ్యాక్సిన్ సంబంధిత విషయాలపై మాట్లాడారు.
'వోకల్ ఫర్ లోకల్'
ప్రసంగమంతటా ఆత్మనిర్భర్ భారత్ గురించే ప్రధానంగా ప్రస్తావించిన నరేంద్ర మోదీ.. ఆత్మనిర్భర్ భారత్ దేశప్రజలందరి సంకల్పం కావాలని ఉద్ఘాటించారు. లోకల్ కోసం వోకల్‌గా మారాల్సిన తురణం ఆసన్నమైందని నొక్కిచెప్పారు. రవాణా హెలికాప్టర్ల నుంచి రైఫిళ్ల వరకూ భారత్‌లోనే తయారీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. భారత్ ఎందులోనూ తక్కువకాదని నిరూపించాలన్నారు. భారత వస్తువులను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లాలని చెప్పారు.
ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ
కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రతి పౌరుడి ఆరోగ్యంపై దృష్టి సారించేలా హెల్త్ ఐడీ జారీ చేస్తామని చెప్పారు మోదీ. ఇందుకోసం డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వైద్యరంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని వ్యాఖ్యానించారు.
కరోనా వ్యాక్సిన్‌పై..
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై పనిచేస్తున్నాయని అన్నారు ప్రధాని. అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు.
కరోనా వ్యాక్సిన్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందని చెప్పిన ప్రధాని.. తయారీ ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 3 వ్యాక్సిన్ క్యాండిడేట్లు వివిధ దశల్లో ప్రయోగాలు జరుపుకుంటున్నాయని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
లద్దాఖ్ గుణపాఠం..
తూర్పు లద్దాఖ్‌లో జరిగింది ప్రపంచం చూసిందని.. సరిహద్దు దాటాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే లద్దాఖ్ గుణపాఠం గుర్తుంచుకోవాలని శత్రుదేశాలకు హెచ్చరికలు పంపారు.
గడిచిన ఆరేళ్లలో ఎన్నో పథకాలు తీసుకొచ్చామని తెలిపిన మోదీ.. మధ్యతరగతి జీవితాన్ని మార్చినట్లు ఉద్ఘాటించారు.