దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొవిడ్-19 టీకా ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది, పంపిణీ కార్యక్రమాల సన్నద్ధత ఎలా ఉంది అనే అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా దేశంలో 130 కోట్ల మందికి టీకా అందించేందుకు నాలుగు మార్గదర్శకాలను సూచించారు మోదీ. వ్యాక్సినేషన్లో కీలకమైన మెడికల్ సరఫరా గొలుసు, ఎవరికి ముందు ఇవ్వాలి, వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పాటు ప్రైవేటు విభాగాలు, పౌరుల పాత్ర వంటి వాటిపై చర్చించారు. మోదీ చేసిన సూచనల్లో ముఖ్యమైనవి...
తొలి ప్రాధాన్యం..
కరోనా వైరస్ బారిన పడేందుకు అధికంగా ముప్పు ఉన్న వారిని గుర్తించి, తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, వైద్యేతర కరోనా యోధులు, ముప్పు పొంచి ఉన్న ప్రజలకు ముందుగా ఇవ్వాలి.
ఎవరికైనా, ఎక్కడైనా..
టీకా ప్రతి ఒక్కరికి అందాలే చర్యలు తీసుకోవాలి. దేశంలో ఎవరు ఎక్కడున్నా ఆ ప్రాంతానికి వాక్సిన్ సరఫరా కావాలి. టీకా పంపిణీకి అడ్డుపడేలా ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు.