నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అభయమిచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని... ఈ ప్రసంగం దేశ సంకల్ప శక్తిని చాటిచెప్పిందని అన్నారు. భారత్ గొప్ప శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తోందని తెలిపిన మోదీ.. ఆ దిశగానే ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఔషధ తయారీ రంగంలో దేశం ఇప్పటికే ఆత్మనిర్భర్ సాధించిందని, భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందని మోదీ తెలిపారు.
అందుకే కొత్త చట్టాలు..
కరోనా నుంచి దేశ ప్రజల ప్రాణాలను దేవుడే కాపాడాడన్న ప్రధాని.. ముందుండి పోరాటం చేసిన వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే ఆ దేవుళ్లేనని అభివర్ణించారు. కొవిడ్ తర్వాత దేశ ప్రజల ప్రణాళికలు మారాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలపై స్పందించిన ప్రధాని.. దేశ వ్యవసాయ రంగాన్ని మార్చడానికే వీటిని తెచ్చినట్లు వివరించారు. చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల గౌరవం ఉందని, వారితో చర్చలకు సిద్ధమని మరోసారి ప్రకటించారు. రైతులు పాత వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను పాటిస్తామని కోరుకుంటే పాటించవచ్చని స్పష్టం చేశారు. సాగు చట్టాలపై తన సమాధానం సమయంలో కాంగ్రెస్ లోక్‌సభ నుంచి వాకౌట్ చేయగా.. ఆ పార్టీ వైఖరి పట్ల ప్రధాని ఘాటు విమర్శలు చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్‌లు తన ప్రసంగం వింటూ ఉంటే లోక్‌సభలో ఆ పార్టీ వాకౌట్ చేసిందని మండిపడ్డారు. దేశాన్ని విభజించి, గందరగోళపరిచే కాంగ్రెస్.. సొంత పార్టీకే కాకుండా, దేశానికి కూడా ఏ మేలు చేయదని విమర్శించారు.
"కరోనా సమయంలో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చాం. సాగును బాగు చేసే చర్యలను కొనసాగించడం చాలా అవసరం, కీలకం. అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి వ్యవసాయ రంగాన్ని బయటకు తీసుకువచ్చేందుకు నిరంతరం ప్రయత్నం చేయాలి. వ్యవసాయరంగం భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్లను ఇప్పటి నుంచే ఎదుర్కోవాలి. వ్యవసాయ చట్టాలపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులను చూశాను.
అయితే.. వారు చట్టాల రంగు నలుపా లేక తెలుపా అన్న దానిపై మాత్రం చాలా చర్చ జరిపారు. దానికంటే చట్టాల్లోని విషయం గురించి, ఉద్దేశాల గురించి చర్చ జరిపితే బాగుండేది. దానివల్ల రైతులకు కూడా మంచి సందేశం వెళ్లి ఉండేది. ఆందోళన చేస్తున్న ప్రతి రైతు భావనను ఈ సభ, ప్రభుత్వం గౌరవిస్తుంది. సాగు చట్టాల్లో ఏవైనా లోపం ఉన్నా, దాని వల్ల రైతులకు నష్టం కల్గుతుందని భావించినా వాటిని మార్చడానికి అభ్యంతరం ఏముంటుంది.?"
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి