మంగళ్ ప్రసాద్ కేవత్.. ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈరోజు ఆయన కుమార్తె వివాహం జరుగుతోంది. ఈ పెళ్లికి బంధువులు, స్నేహితులతో పాటు తమ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ ఆహ్వానం పంపారు కేవత్.
రిక్షావాలా ఆహ్వానానికి స్పందించారు ప్రధాని మోదీ. బదులుగా ఓ లేఖ రాశారు. బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లికి హాజరుకాలేకపోతున్నానని.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
"పూజ్యులైన మంగళ్ ప్రసాద్ కేవత్ గారికి. కొత్త జీవితం ప్రారంభిస్తున్న నూతన వధూవరులకు నా శుభాకాంక్షలు. వారి జీవితం ఆనందం, సమైక్యత, స్నేహంతో సాగాలని కోరుకుంటున్నాను. కాలక్రమేణా వారి మధ్య సాంగత్యం, జీవితంలో ముందుకు సాగడంలో బంధం బలపడాలని నేను ఆకాంక్షిస్తున్నాను"అని లేఖలో పేర్కొన్నారు మోదీ.
ప్రధానమంత్రి నుంచి శుభాకాంక్షలు అందటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మంగళ్ కేవత్. స్వయంగా ప్రధానే వివాహానికి హాజరైనట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.