రానున్న ఐదారేళ్ల వ్యవధిలో దేశంలోని సహజవాయు పైప్లైన్ల నెట్‌వర్క్‌ను రెండింతలు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం 1,500గా ఉన్న సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను పది వేలకు పెంచనున్నట్లు వెల్లడించారు.
కొచ్చి-మంగళూరు మధ్య నిర్మించిన సహజవాయువు పైపులైన్‌ను ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు మోదీ. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 'ఒకే దేశం-ఒకే గ్యాస్ గ్రిడ్'లో భాగంగా కొచ్చి-మంగళూరు పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టారు.
అభివృద్ధికి రెక్కలు!
ఈ పైప్‌లైన్‌ను జాతికి అంకితమివ్వడం గౌరవంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. భారత ప్రజలకు, ముఖ్యంగా కేరళ, కర్ణాటక వాసులకు ఈరోజు ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఇతర నగరాల్లో కొత్త గ్యాస్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు ఈ పైప్‌లైన్ దోహదం చేస్తుందని చెప్పారు. భారత వృద్ధి కోసం వాయు, జల, రోడ్డు మార్గాలతో పాటు రైల్వే, మెట్రో, డిజిటల్, గ్యాస్ కనెక్టివిటీని సైతం మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. దేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
"గతంలో భారతదేశ వృద్ధి నెమ్మదిగా సాగేందుకు గల కారణాలపై మాట్లాడాలని అనుకోవడం లేదు. కానీ, భారత వృద్ధి ఇప్పుడు నెమ్మదిగా సాగదు. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశ వృద్ధి వేగం పుంజుకుంది. ఆర్థిక వ్యవస్థ పరిమాణం, పరిధి పెరిగింది. దేశాభివృద్ధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కర్ణాటక, కేరళ గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు.