భారత్.. స్వయం సమృద్ధ దేశంగా మారాల్సిన ఆవశ్యకతను కరోనా సంక్షోభం తెలియచెప్పిందని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. మే 17తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించారు ఆయన.
కరోనా సంకటం కన్నా భారతీయుల సంకల్పం గొప్పదని ఉద్ఘాటించారు ప్రధాని. వైరస్ వ్యాప్తికి ముందు ఒక్క పీపీఈ కిట్ అయినా ఉత్పత్తి కాని దేశం... ప్రస్తుతం 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్95 మాస్కులు తయారు చేసే స్థాయికి ఎదగడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇదే స్ఫూర్తిగా కరోనాను ఎదుర్కొని ముందుకు సాగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
స్వదేశీ మంత్రం
సంక్షోభ సమయంలో దేశీయ ఉత్పత్తిదారులు, సరఫరాదారులు మన డిమాండ్లకు తగినట్లు సేవలు అందించారని కితాబిచ్చారు మోదీ. అందుకే భారతీయులంతా ఇకపైనా దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనేందుకు మొగ్గుచూపి, వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
అదే సమయంలో... స్వయం సమృద్ధ దేశం అంటే స్వయం కేంద్రీకృత దేశం కాదని స్పష్టంచేశారు మోదీ. ప్రపంచ మానవాళి సంతోషం, సంక్షేమం, సహకారం, శాంతి కోరుకునే ఆత్మ నిర్భర భారత్‌గా ముందుకు సాగుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్థికం, మౌలిక రంగం, సాంకేతికత ఆధారిత వ్యవస్థ, శక్తిమంతమైన జనసమూహం, డిమాండ్... ఆత్మ నిర్భర భారత్ నిర్మాణంలో 5 స్తంభాలుగా నిలుస్తాయని చెప్పారు మోదీ.