బడిలో పాఠాలు ఇంట్లో నేర్పిస్తోన్న బుడతలు! ఉత్తర్ప్రదేశ్ ఫతేపుర్ జిల్లాలోని ఓ కుగ్రామంలో సర్వ శిక్షా అభియాన్ కింద ఉచిత ప్రాథమిక విద్యను అందిస్తోంది ప్రభుత్వం. పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే పహ్రావాపుర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మరో అడుగు ముందుకేశారు.
పాఠశాల చెప్పిన 'ఈచ్ వన్- టీచ్ వన్' అనే నినాదంతో అక్కడి విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐదోతరగతి విద్యార్థులు పాఠశాల ముగిసిన అనంతరం.. ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో చదువురాని వారికోసం ఒక గంట కేటాయించి విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులు ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకొనేందుకు ఉపాధ్యాయులు తనిఖీ చేస్తుంటారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించినందుకు గానూ గతంలో ఈ పాఠశాలకు అత్యుత్తమ పాఠశాలగా అవార్డు లభించింది.
ఈ మార్పు కోసం పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో కష్టపడ్డారు. ప్రస్తుతం ఈ బడిలో విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా రాణిస్తున్నారు. గ్రామీణ సమాజాన్ని విద్యావంతులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలం భదౌరియా తెలిపారు.
"పిల్లల తల్లిదండ్రులు, బంధువుల్లో ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో వారికి చదువు నేర్పించడం 'ఈచ్ వన్ టీచ్ వన్' ముఖ్య ఉద్దేశం. కేవలం పిల్లలకు నేర్పిస్తోన్న పాఠాల ద్వారానే రెండేళ్ల నుంచి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలు తమ ఇంట్లో కుటుంబసభ్యులకు చదువు నేర్పిస్తారు. తల్లిదండ్రులను ఇక్కడికి పిలిచి.. విద్యార్థులు ఎంత వరకు సక్రమంగా పెద్దవారికి చదువు చెప్పగల్గుతున్నారనేది సమీక్షిస్తాం."
-నీలం భదౌరియా, ప్రధానోపాధ్యాయురాలు
ఈ వినూత్న ప్రయత్నం వల్ల గ్రామస్థులకు చదువు రావడమే కాక.. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం మెరుగుపడుతోంది. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థులు, గ్రామస్థులను పాఠశాల వార్షికోత్సవం రోజున సత్కరిస్తారు.