పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ అన్నది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) స్థాపిత లక్ష్యాల్లో అత్యంత కీలకమైనది. "ప్రజాప్రయోజనాల పరిరక్షకురాలిగా సమాచార మాధ్యమం సమర్థంగా పని చెయ్యాలంటే, ఏ వ్యక్తులు, సంస్థలు, అధికార శ్రేణుల నుంచి ఎలాంటి ప్రతిబంధకాలూ లేని సుభద్రమైన భావ ప్రకటన స్వేచ్ఛ దానికి ఉండి తీరాలి" అని అంతర్జాలంలో తన పుట్టుపూర్వోత్తరాల్ని ఏకరువుపెడుతూ పీసీఐ గట్టిగా ప్రకటిస్తోంది. చట్టబద్ధమైన, స్వతంత్ర, పాక్షిక న్యాయసంస్థగా పత్రికా స్వేచ్ఛకు రక్షాకవచంగా నిలవాల్సిన పీసీఐ- సుప్రీంకోర్టు విచారణలో ఉన్న "కశ్మీర్ టైమ్స్" వ్యాజ్యంలో జోక్యం చేసుకొంటూ ఇటీవల వెలగబెట్టిన నిర్వాకం నిశ్చేష్టపరుస్తోంది.
జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర విభజనల దరిమిలా అక్కడ మీడియా స్వేచ్ఛకు సర్కారు సంకెళ్లు వేసింది. ఇంటర్నెట్, టెలీ కమ్యూనికేషన్ సేవల్ని పూర్తిగా నిలిపేసి విలేకరులు, ఫొటో జర్నలిస్టుల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాత్రికేయులు తమ వృత్తిధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నారంటూ కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని 14, 19 అధికరణల ద్వారా పాత్రికేయులకు దఖలుపడిన హక్కుల్ని తొక్కిపడుతున్న ఆంక్షల్ని రద్దు చేయాలని అభ్యర్థించారు. ఆ వ్యాజ్య విచారణలో తనకు తానుగా జోక్యం చేసుకున్న పీసీఐ- సమాచార ప్రసార సాధనాలపై ఆంక్షల విధింపు జాతిసమైక్యత సమగ్రతల కోసమేనంటూ భిన్నగళంతో స్పందించింది.
పత్రికాస్వేచ్ఛ, జాతి ప్రయోజనాల విషయంలో న్యాయపాలిక సరైన నిర్ణయం తీసుకొనేలా సహకరించేందుకంటూ పీసీఐ ఒలకబోసిన అత్యుత్సాహం- ప్రెస్ కౌన్సిల్ స్థాపిత లక్ష్యంపైనే సమ్మెట పోటుగా పరిణమించింది. పాత్రికేయ స్వాతంత్య్రానికి గొడుగుపట్టి, తటస్థంగా వ్యవహరించాల్సిన పీసీఐ ప్రభుత్వ విభాగంగా పనిచేస్తోందని ఎడిటర్స్ గిల్డ్ సహా మూడు సంస్థలు సంయుక్త ప్రకటనలో నిరసించాయి. కశ్మీరులో పరిస్థితుల అంచనాకు నలుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందాన్ని పంపాలన్న పీసీఐ తాజా నిర్ణయం- గుర్రం ముందు బండికట్టిన చందంగానే అఘోరించింది!
భారత రాజ్యాంగంలోని 19(1) (ఏ) అధికరణ ద్వారా పత్రికాస్వేచ్ఛ పురుడు పోసుకుంది. పత్రికా స్వేచ్ఛ అన్న మాటను రాజ్యాంగం సూటిగా ప్రస్తావించకపోయినా- భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి వ్యక్తి, పౌరుడు, పత్రికలన్నీ ఒకే గాటన ఉంటాయన్న భారత రత్న అంబేడ్కర్ ప్రకటన- పాత్రికేయానికి దారిదీపమైంది. "దేశవ్యాప్తంగా న్యాయస్థానాలన్నీ భావ ప్రకటన స్వేచ్ఛకు గొడుగుపట్టాలి... దాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేసే చట్టాల్ని, చర్యల్ని తోసిపుచ్చడం వాటి ప్రాథమిక విధి" అని మూడు దశాబ్దాల క్రితమే సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. సంక్షుభిత పరిస్థితుల్లో నిష్పాక్షిక సంస్థగా ఎలా వ్యవహరించగల వీలుందో జస్టిస్ ఆర్‌ఎస్ సర్కారియా సారథ్యంలోని పీసీఐ 1990లో ప్రత్యక్ష నిదర్శనగా నిలిచింది.