కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభనలో సరికొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఇందుకు సంబంధించిన దస్త్రంపై కోవింద్ ఆమోదముద్ర వేశారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన 15 రోజుల తర్వాత కూడా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదని గవర్నర్... కేంద్రానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అంశాలను పరిశీలించానని.. అయినా రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని నివేదికలో పేర్కొన్నారు. వేరే ప్రత్యామ్నాయం లేనందున రాష్ట్రపతి పాలనే సరైన మార్గం అని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్.. గవర్నర్ సిఫార్సుకు ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్ ప్రతిపాదన, గవర్నర్ నివేదిక రాష్ట్రపతి భవన్‌కు చేరాయి. కోవింద్ సంతకంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
గవర్నర్ నిర్ణయంపై మండిపడ్డ కాంగ్రెస్...
మహారాష్ట్రలో గవర్నర్... రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. రాజ్యాంగ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.