తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహారాష్ట్రలో నవంబర్​ 7 తరువాత రాష్ట్రపతి పాలన!' - President's rule imposed in Maharashtra

మహారాష్ట్రలో నవంబర్ 7 నాటికి ప్రభుత్వం ఏర్పాటుకాకపోతే, రాష్ట్రపతి పాలన విధించవచ్చంటూ భాజపా నేత సుధీర్​ ముంగంతివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుపై ఎన్​సీపీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తాము ప్రతిపక్షంలో ఉంటామని ఎన్​సీపీ నేత అజిత్ పవార్​ చెప్పగా... ప్రత్యామ్నాయం చూపిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్​ అన్నారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

By

Published : Nov 1, 2019, 3:24 PM IST

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడి 8 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుకాని నేపథ్యంలో భాజపా నేత సుధీర్​ ముంగంతివార్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్​ 7 నాటికి ప్రభుత్వం ఏర్పాటుకాకపోతే రాష్ట్రపతి పాలన విధించవచ్చని పేర్కొన్నారు.

"నవంబర్ 7లోగా మహారాష్ట్రలో భాజపా-శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకపోతే.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది."
- సుధీర్​ ముంగంతివార్, భాజపా నేత

ఒకటి రెండు రోజుల్లో భాజపా, శివసేన ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరిపే అవకాశం ఉందని ఓ మరాఠీ ఛానల్​తో చెప్పారు సుధీర్.

ఎన్​సీపీలో భిన్నవాదనలు

అధికార పగ్గాలు చేపట్టడంపై భాజపా-శివసేన మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగా.... భవిష్యత్​ కార్యాచరణపై విపక్షాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాము, తమ మిత్రపక్షం కాంగ్రెస్... ప్రతిపక్షంలోనే ఉంటాయని స్పష్టంచేశారు ఎన్​సీపీ కీలక నేత అజిత్ పవార్. ప్రజా తీర్పును గౌరవిస్తామని తెలిపారు.

ఎన్​సీపీ ప్రధాన అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్​ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. భాజపా, శివసేన ప్రభుత్వం ఏర్పాటుచేయడంలో విఫలమైతే ఎన్​సీపీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రపతి పాలన విధించవచ్చని సుధీర్​ ముంగంతివార్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇది చాలా ప్రమాదకర చర్య అవుతుందని హెచ్చరించారు నవాబ్.

మెజారిటీ ఉన్నా...

288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 105, శివసేన 56 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీ సాధించాయి. అయితే ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఇరుపార్టీలు పట్టువీడడం లేదు. ఎన్​సీపీ 54, మిత్రపక్షం కాంగ్రెస్ 44 సీట్లు సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు 145.

ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై భారత్​-జర్మనీ ఉమ్మడి పోరు ఉద్ధృతం'

ABOUT THE AUTHOR

...view details