అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సకుటుంబ సపరివార సమేతంగా తొలిసారి భారత పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆయన రాక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్కడ చూసినా ట్రంప్ వార్తలే. ఆయన పర్యటించనున్న అహ్మదాబాద్, ఆగ్రా, దిల్లీలో భద్రత, స్వాగతం కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది భారత ప్రభుత్వం. ఈ నగరాల్లోని రోడ్లు, గోడలు, పరిసర ప్రాంతాలు, సందర్శనా స్థలాలకు కొత్త కళ సంతరించుకుంది. అంత సుందరంగా తయారయ్యాయి మరి.
తొలుత అహ్మదాబాద్, ఆగ్రా పర్యటన ముగిసిన అనంతరం 24న రాత్రి ట్రంప్ ఎక్కడ విశ్రాంతి తీసుకుంటారు? ఆయన ఉండే హోటల్ ఎక్కడ? దానికయ్యే ఖర్చు ఎంతో అందరికీ తెలుసుకోవాలనే ఉంటుంది కదా?
ఐటీసీ మౌర్య..
ట్రంప్ బస కోసం అత్యంత సురక్షితమైన, సుందరమైన ప్రదేశాన్ని ఎంపిక చేసింది భారత ప్రభుత్వం. 24న రాత్రి దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో ఉండనున్నారు డొనాల్డ్ ట్రంప్ దంపతులు. అదీ ప్రెసిడెన్షియల్ స్వీట్లో. ఇప్పుడు చాణక్య స్వీట్‌గా పిలిచే ఈ గది అద్దె ఒక్క రాత్రికి అక్షరాలా రూ.8 లక్షలు. అవును ఒక్క రాత్రికి అంత వెచ్చిస్తుంది భారత సర్కార్.
ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించిన తర్వాత.. ట్రంప్ దంపతులు దిల్లీ చాణక్యపురిలో ఉన్న ఈ ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకుంటారు. గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్‌లోని చాణక్య స్వీట్లోనే సేదతీరుతారు.
ప్రత్యేకతలివే...
ఈ స్వీట్ 4,600 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. ఇక్కడ ఒక్క రాత్రికయ్యే ఖర్చు రూ. 8 లక్షలు. ఇక్కడ హైస్పీడ్ లిఫ్ట్, అధ్యక్షుడు మాత్రమే వెళ్లేలా ప్రత్యేక ప్రవేశ ద్వారం, స్వతంత్ర భద్రతా నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో బిగించిన కిటికీలూ ఉంటాయి. ప్రెసిడెన్షియల్ ఫ్లోర్ అంటే ఆ మాత్రం సురక్షితంగా ఉండాలి కదా.
మినీ స్పా, జిమ్...
చాణక్య స్వీట్లో రెండు గదులుంటాయి. పడుకునేందుకు, ఇతర పనులకు ఒక పెద్ద గది, 12 మంది కూర్చుని తినేలా వీలుండే మరో పెద్ద భోజన గది ఉంటాయి. ఇందులో చిన్నపాటి స్పా ఏర్పాటు చేశారు. వ్యాయామం కోసం జిమ్ ఉండనే ఉంది.