కశ్మీర్‌లోయలో రెండు నెలలకు సరిపడా వంటగ్యాస్ నిల్వ ఉండేలా చూడాలని ప్రభుత్వం చమురు సంస్థలను ఆదేశించడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాట్లింగ్ పాయింట్లు, గోదాముల్లో తగినంత నిల్వలు ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సలహాదారుగా ఉన్న ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ రహదారిపై తరచు కొండచరియలు పడి రవాణాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉన్నందున తగినన్ని నిల్వలు ఉంచాలని, ఇది చాలా అత్యవసరమని పేర్కొన్నారు. దీంతో పాటుగా కేంద్ర బలగాలు బస చేయడానికి గాందర్‌బల్ జిల్లాలో పాఠశాలలు సహా 16 విద్యాసంస్థల్లో ఏర్పాట్లు చేయాలని ఆ జిల్లా సీనియర్ ఎస్పీ ఇటీవల జిల్లా అధికారులను కోరారు. అమర్‌నాథ్ యాత్రికులకు రక్షణ కల్పించడానికి వచ్చే బలగాలకు వసతి కల్పించాల్సి ఉన్నందున ఇక్కడ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అయితే ఈ ఉత్తర్వులపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శీతకాలంలో గ్యాస్‌ను నిల్వ చేయడం సాధారణమే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆదేశాలు ఇవ్వడం, అవి అత్యవసరమని పేర్కొనడాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని భావిస్తుండగా, పెద్దయెత్తున కేంద్ర బలగాలు రావాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొనే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
'కశ్మీర్‌లో 2 నెలలకు సరిపడా వంటగ్యాస్ నిల్వ చేయండి' - జమ్ము కశ్మీర్‌లో వంటగ్యాస్ నిల్వలు
కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో రెండు నెలలకు సరిపడా వంటగ్యాస్ నిల్వ ఉండేలా చూడాలని చమురు సంస్థలను ఆదేశించింది. జాతీయ రహదారిపై తరచు కొండచరియలు పడి రవాణాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉన్నందున తగినన్ని నిల్వలు ఉంచాలని, ఇది చాలా అత్యవసరమని స్పష్టం చేసింది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నట్లు పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కశ్మీర్‌లో 2 నెలలకు సరిపడా వంటగ్యాస్ నిల్వ చేయండి