భారత ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగం.. 'చంద్రయాన్-2'కు కౌంట్‌డౌన్ మొదలయ్యింది. సోమవారం తెల్లవారుజామున ప్రయోగించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ . చంద్రయాన్-2 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు.
" సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు శ్రీహరికోట నుంచి చంద్రయాన్-2ను ప్రయోగించనున్నాం. అందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రయోగం కోసం జీఎస్ఎల్వీ-మార్క్-3 వాహకాన్ని వినియోగించాం. దాదాపు రెండు నెలల తర్వాత చంద్రయాన్-2 చంద్రుడిపై అడుగుపెట్టనుంది. 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1 కు ఈ ప్రయోగం కొనసాగింపు లాంటింది. చంద్రుడి పుట్టుక, పరిమాణంపై పరిశోధించడమే ఈ ప్రయోగ ముఖ్య ఉద్దేశం."
- డాక్టర్ కె. శివన్, ఇస్రో ఛైర్మన్