దీపావళి అంటేనే టపాసులు. పండుగకు కొద్దిరోజుల ముందే టపాకాయల మోత మొదలుకావాల్సిందే. కానీ... ఈ సరదా వెనుక దాగి ఉన్న ప్రమాదంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. బాణసంచా కారణంగా జరిగే వాయు, శబ్ద కాలుష్య తీవ్రత అందరికీ అర్థమవుతోంది.
మరి పర్యావరణం కోసం టపాసుల సరదాను వదులుకోవాల్సిందేనా? అవసరం లేదంటున్నారు చెన్నై మాధవరంలోని ఉద్యానవన కళాశాల విద్యార్థులు. ఇందుకోసం వినూత్న టపాకాయలను తయారు చేస్తున్నారు.
ఈ హరిత టపాసులు పెద్ద పెద్ద శబ్దాలు చేయవు. కాలుష్య కారకాలను విడుదల చేయవు. వీటిని మట్టితో తయారు చేస్తారు. దుకాణాల్లో దొరికే వాటిలాగానే రూపొందించి వత్తుల లోపల వివిధ రకాల విత్తనాలు వేస్తున్నారు. దీపావళి సందర్భంగా వీటిని తీసుకెళ్లి.. పండుగ అనంతరం ఇంటి ఆవరణలోని కుండీల్లో, ఖాళీ స్థలంలో వేయాలని సూచిస్తున్నారు. దీని ద్వారా మొక్కలు విరివిగా పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెబుతున్నారు విద్యార్థులు.