డోలీలో మోసుకెళ్లి.. అంబులెన్స్‌లో ప్రసవం చేయించారు! సమయానికి వైద్య సేవలందక పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న తల్లులు దేశంలో ఇంకా ఉన్నారు. కనీస సౌకర్యాలు లేని పల్లెల దీన పరిస్థితులు మరోసారి వెలుగులోకొచ్చాయి. ఛత్తీస్‌గఢ్ మెయిన్పాట్లోని పర్పటియాలో సరైన రోడ్డు మార్గం లేక అంబులెన్స్ ఆ గ్రామాన్ని చేరుకోలేకపోయింది. అందుకే ఓ నిండు గర్భిణీని గ్రామస్థులు కర్రకు కట్టిన డోలీలో కూర్చోబెట్టి కాలినడకన 2 కిలోమీటర్లు మోసుకెళ్లారు. పురిటి నొప్పులకు తోడైన తిప్పలు
22 ఏళ్ల ధనేశ్వరీ కొర్వా తొమ్మిది నెలల గర్భిణీ. పురిటి నొప్పులు మొదలయ్యాయి. తనను 35 కి.మీ దూరంలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తే కొంతైనా ఉపశమనం కలుగుతుందని భావించారు కుటుంబ సభ్యులు. ఉదయం 8:30 నిమిషాలకు సర్కార్ అంబులెన్స్‌కు ఫోన్ చేసి సాయం కోరారు. అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి గ్రామానికి బయల్దేరారు. కానీ... వర్షాల కారణంగా రోడ్డు మార్గం బురదమయమైంది. వాహనాలేవీ ఆ గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ దగ్గరకు గర్భిణీని తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
కష్టం పంచుకున్న మానవత్వం
సమయం గడుస్తున్న కొద్దీ మహిళకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. అప్పుడు ఆమె భర్త ఊర్లో లేరు. ఆమె బాధను చూసి గ్రామస్థులు చలించిపోయారు. కర్రకు ఊయల కట్టి ఆమెను అందులో కూర్చోబెట్టారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు పురుషులు కర్రను భుజాలపై మోస్తూ ఆమెను అంబులెన్స్ వరకు మోసుకెళ్లారు. కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు ఆమెకు అవసరమయ్యే వస్తువులను మోసుకొచ్చారు.
అంబులెన్స్‌లోనే ప్రసవం
కుటుంబ సభ్యులు అంబులెన్స్ ఎక్కి కూర్చున్నారు. కానీ బురదలో చిక్కుకోవడం వల్ల ముందుకు కదలలేకపోయింది. గ్రామస్థులు వాహనాన్ని తోశారు. ఎంతకూ లాభం లేకపోయేసరికి అంబులెన్స్‌లో వచ్చిన సిబ్బంది.. డండకేసరా గ్రామం వద్దే సురక్షితంగా పురుడు పోశారు. ధీనేశ్వరీ మగ శిశువుకు జన్మనిచ్చింది.
ఇదీ చూడండి:వరద ప్రవాహానికి కళ్లముందే కుప్పకూలిన భవనం