ఉత్తర్ప్రదేశ్లో హృదయ విదారక ఘటన జరిగింది. కరోనాను అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా 8నెలల నిండు గర్భిణి 200 కి.మీ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఊరెళ్లడమే ఉత్తమమని...
జలాన్ జిల్లాకు చెందిన అంజూదేవీ, భర్త అశోక్ పొట్టకూటి కోసం నోయిడాకు వలస వచ్చారు. భవన నిర్మాణ పనులు చేస్తూ బతుకీడుస్తున్నారు. దేశవ్యాప్త లాక్డౌన్తో వారం రోజులుగా జీవనోపాధి కోల్పోయారు. చేసేదేమీ లేక రాత్లోని వారి స్వగ్రామం ఔంటాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కానీ, రవాణా సౌకర్యం లేదు. అయినా సరే, పట్టణంలో ఉండి ఇక్కట్లు పడడం కంటే ఊరెళ్లడమే సబబు అనుకుంది అంజూ. ఎనిమిది నెలల గర్భిణి అయినా.. సాహసం చేసి భర్తతో కలిసి నడక మొదలెట్టింది. కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటూ ఇద్దరూ ప్రయాణం సాగించారు.