తెలంగాణ

telangana

మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు

By

Published : Jun 3, 2020, 11:51 AM IST

Updated : Jun 3, 2020, 10:07 PM IST

మనిషికి మాత్రమే వచ్చిన విద్య నమ్మించి మోసం చేయడం.. అది సాటి మనిషినైనా.. నమ్మిన జంతువునైనా.. చాలా చోట్ల కుక్కల్ని పెంచుకొని అవి ముసలివికాగానే మారుమూల ప్రదేశాల్లో వాటిని కట్టేసి రావడం.. అవి యజమాని కోసం ఎదురుచూస్తూ ఆకలితో ప్రాణాలొదలడం వంటివి తరచూ మనకు సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. కానీ, ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశచూపి.. దాని ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు.. ఇంత జరిగినా ఎవరికీ అపకారం చేయకుండా.. మోసపోయాననే బాధతో విలవిల్లాడిపోతూ అక్కడి నుంచి నిష్క్రమించింది. కొన్నాళ్లపాటు బాధతో కుమిలిపోయి నిలుచున్నచోటే ప్రాణం కోల్పోయింది.. అది చేసిన తప్పు మనిషిని నమ్మడమే..!

Pregnant elephant in Kerala bites cracker-stuffed pineapple, dies standing in river
నమ్మింది.. మోసపోయింది..!

మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన గత నెలలో కేరళలో చోటు చేసుకొంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో మల్లప్పురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది ఎవరినీ ఏమీ చేయకుండా తన దారిన పోతుండగా.. కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్‌ ఆశచూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. అది ఆ మనుషులను నమ్మి వారు ఇచ్చిన పండును తీసుకొని నోటపెట్టింది. అంతే.. ఆ పండు భారీ చప్పుడుతో పేలింది. ఆ మూగజీవి నోటివెంట రక్తం ధారగా కారింది. అంత బాధలో కూడా అది తనను మోసం చేసిన మనుషులపై దాడిచేయలేదు. రక్తమోడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏమి చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్‌ నదిలోకి దిగి గొంతు తడుపుకొంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం.. ఈగల బాధ తప్పడంతో అక్కడే ఉండిపోయింది.

ఈ ఘటన మానవత్వానికే మచ్చ

విషయం తెలుసుకొన్న అటవీశాఖ సిబ్బంది.. సురేందర్‌, నీలకంఠన్‌ అనే మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27వ తేదీ సాయంత్రం 4గంటలకు తుదిశ్వాస విడిచింది. కేవలం మనుషులను నమ్మినందుకు అది తన కడపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. హృదయ విదారకమైన ఈ ఘటనను మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్‌ కృష్ణన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించారు. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని తెలిసి వైద్యులు బాధపడ్డారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి:నవ దంపతులకు హైకోర్టు షాక్​.. 10 వేల జరిమానా!

Last Updated : Jun 3, 2020, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details