స్వాతంత్ర్యానంతర భారత రాజకీయాలలో ఆయనది ప్రత్యేక శకం. భారత రాష్ట్రపతిగా, అద్భుతమైన వాక్ చాతుర్యంతో అందరిని ఒప్పించే రాజనీతిజ్ఞుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా విభిన్న పాత్రలు పోషించి, రాజకీయ రంగంలో అనేక ఆటుపోట్లను తట్టుకొని దీటుగా నిలబడ్డ మధ్యతరగతి ప్రతిబింబం 'ప్రణబ్ ముఖర్జీ'.
తలపండిన మేధావులు నిండిన పెద్దల సభలో 34 ఏళ్లకే అడుగుపెట్టారు ప్రణబ్. 47 ఏళ్ల వయసులో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశ ఆర్థిక చక్రాలను పరుగులు పెట్టించారు. గాంధేయవాదిగా.. కరుడు కట్టిన కాంగ్రెస్‌వాదిగా.. మచ్చలేని రాజకీయ నేతగా.. అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.
సున్నితంగా చెప్పినట్లు ఉన్నా చురుకుగా తన మనసులోని భావాలను ఎదుటివారికి అర్థం అయ్యేలా చెప్పగలిగే నేర్పరి ప్రణబ్. మిత్రపక్షాలు బెట్టు చేసినా, ప్రత్యర్థి పార్టీలు ఉడుం పట్టు పట్టినా.. నొప్పించక ఒప్పించే శైలి ఆయనకే సొంతం.