జాతి పిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించడంపై భాజపా ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు తెలిపారు. గాడ్సే వ్యాఖ్యలపై రాజకీయంగా పెను దుమారం రేగిన నేపథ్యంలో ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనను ఉగ్రవాదిగా పోల్చడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ప్రగ్యా.
"లోక్‌సభలో నేను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరికైనా బాధ కల్గితే అందుకు నేను చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నా. సభలో నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. నేను వ్యాఖ్యలు చేసిన సందర్భం వేరే ఉంది. నా వ్యాఖ్యలను వక్రీకరించడం నిందించాల్సిన విషయం. మహాత్మాగాంధీ దేశానికి చేసిన సేవలను నేను గౌరవిస్తాను. ఈ సభలోని ఓ వ్యక్తి బహిరంగంగా నన్ను ఉగ్రవాది అని అన్నారు. అప్పటి ప్రభుత్వాలు కుట్రల ద్వారా నా మీద మోపిన ఆరోపణలు న్యాయస్థానంలో నిరూపణ కాలేదు. నన్ను ఉగ్రవాది అని అనడం చట్ట విరుద్ధం."
- సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, భాజపా ఎంపీ.
రికార్డుల నుంచి తొలగింపు..
ప్రగ్యా క్షమాపణలు చెప్పిన క్రమంలో గాడ్సే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. మహాత్ముడి గురించి ప్రపంచం మొత్తం తెలుసని ఉద్ఘాటించారు.