తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాడ్సే దేశభక్తుడంటూ.. మరోమారు నోరుజారిన ప్రగ్యా​ సింగ్​! - pragya singh takhur

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే భాజపా పార్లమెంట్ సభ్యురాలు ప్రగ్యాసింగ్ ఠాకూర్ మరోసారి నోరుజారారు. ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు నాథూరాం గాడ్సేను దేశభక్తుడు అంటూ లోక్​సభలో వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషీ... ప్రగ్యా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

Pragya refers to Nathuram Godse as 'deshbhakt' in Lok Sabha
గాడ్సే దేశభక్తుడంటూ.. మరోమారు నోరుజారిన భాజపా ఎంపీ ప్రగ్యా​!

By

Published : Nov 27, 2019, 9:24 PM IST

Updated : Nov 27, 2019, 10:44 PM IST

భాజపా పార్లమెంట్ సభ్యురాలు ప్రగ్యాసింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీని హాత్యచేసిన నాథూరాం గాడ్సేను లోక్​సభ వేదికగా దేశభక్తుడిగా అభివర్ణించారు.

ప్రత్యేక రక్షణ దళాల సవరణ బిల్లుపై లోక్​సభలో చర్చ జరుగుతున్న సమయంలో డీఎంకే సభ్యుడు ఏ రాజా.. గాంధీజీని గాడ్సే ఎందుకు చంపాడు అన్న విషయాన్ని లేవనెత్తారు. గాంధీపై గాడ్సే 32 ఏళ్లు పగ పెంచుకొని హత్య చేసినట్లు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారని రాజా పేర్కొన్నారు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నందుకే గాంధీని చంపాడని అన్నారు. అప్పుడే ప్రగ్యా ఠాకూర్ కల్పించుకొని "దేశ భక్తుల ఉదాహరణలు ఇవ్వకూడదు" అంటూ వ్యాఖ్యానించారు.

అనంతరం ప్రగ్యా చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలనుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. భాజపా సభ్యులు సైతం ప్రగ్యాను కూర్చొమంటూ వారించారు. మధ్యలో కల్పించుకున్న స్పీకర్ ఓం బిర్లా... కేవలం రాజా వ్యాఖ్యలను మాత్రమే పార్లమెంట్ రికార్డు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

అలాంటిదేమీ లేదు-ప్రహ్లాద్

ఈ విషయంపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. నాథూరాం గాడ్సే పేరును ప్రగ్యా ఠాకూర్ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.

"ప్రగ్యా మైక్ ఆన్​లో లేదు. కేవలం ఉధమ్​ సింగ్ పేరు ప్రస్తావించినప్పుడు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని నాకు ప్రత్యేకంగా వివరించింది. గాడ్సే పేరుగానీ మరే ఇతర వ్యక్తుల పేర్లు గానీ ప్రస్తావించలేదు. అలాంటి అంశాలు రికార్డుల్లో లేవు. అలా వార్తలను వ్యాప్తి చేయడం సరికాదు.
-ప్రహ్లద్ జోషీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

గతంలోనూ..

గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భాజపాకు తలనొప్పిగా మారారు ప్రగ్యా. నాతూరాం గాడ్సే దేశభక్తుడని, ఎప్పటికీ దేశభక్తుడిగానే ఉంటాడని గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. గాంధీని అవమానించినందుకు భాజపా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై ప్రగ్యా క్షమాపణలు కూడా కోరారు.

Last Updated : Nov 27, 2019, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details