తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాయుదాడుల తర్వాత.. సముద్రంలో 21 రోజులు - జలాంతర్గామి

పుల్వామా దాడి అనంతరం భారత్​ కచ్చితంగా ప్రతిదాడి చేస్తుందని పాక్​ సహా ప్రపంచమంతా అనుకొంది. ఏ దాడినైనా సమర్థంగా ప్రతిఘటించేందుకు పాకిస్థాన్​ కూడా సిద్ధంగానే ఉంది. అయితే భారత్​ దాయాదులకు అంతుచిక్కని వ్యూహంతో దెబ్బకొట్టింది.  బాలాకోట్​పై భారత వైమానికి దళం విరుచుకుపడిన అనంతరం పాక్​ ఏం చేసింది? బాలాకోట్​ దాడి తర్వాత సముద్రగర్భంలో ఏం జరిగింది?

పీఎన్​ఎస్ సాథ్

By

Published : Jun 23, 2019, 6:28 PM IST

Updated : Jun 23, 2019, 8:39 PM IST

వాయుదాడుల తర్వాత.. సముద్రంలో 21 రోజులు

అది 2019, ఫిబ్రవరి 14.. భారత సీఆర్​పీఎఫ్​ జవాన్లపై పుల్వామా దాడి జరిగిన రోజు. అదే రోజున భారత్​ తన త్రివిధ దళాలను హై అలర్ట్​ చేసింది. ముఖ్యంగా నావికాదళాన్ని జలాంతర్గాములు, అణు జలాంతర్గాములతో సహా దేశ తీర ప్రాంత జలాల్లో మోహరించింది. పాకిస్థాన్​ ప్రాదేశిక తీర ప్రాంత సమీపంలో దాయాది చర్యలను నిశితంగా గమనిస్తున్నాయి భారత యుద్ధ నౌకలు.

భారత్​ చర్యలను గమనించిన దాయాది దేశం పాక్​... భారత్ కచ్చితంగా పుల్వామా దాడికి బదులు తీర్చుకునేందుకు తన నావికాదళంతో తమపై విరుచుకుపడుతుందని అంచనా వేసింది.

భారత్​ మాత్రం పాకిస్థాన్​ సైన్యంపై డేగ కన్ను వేసి ఉంచింది. ఓ వైపు నౌకాదళం, మరో వైపు భారత సైన్యాన్ని పటిష్ఠ పరిచి.. 2019, ఫిబ్రవరి 26న ఊహించని రీతిలో బాలాకోట్​లోని ఉగ్రస్థావరాలపై భారత యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దాయాది తేరుకునే లోపు మన మిరాజ్​లు పనికానిచ్చి సురక్షితంగా తిరిగొచ్చాయి.

పాక్​ ఏం చేసింది..?

బాలాకోట్​ దాడి జరిగిన తర్వాత పాకిస్థాన్​కు చెందిన అత్యంత ఆధునిక అగోస్టా జలాంతర్గామి- పీఎన్​ఎస్​ సాథ్ ఆ దేశ ప్రాదేశిక జలాల నుంచి మాయమైంది.

మిగిలిన జలాంతర్గాములతో పోలిస్తే పీఎన్​ఎస్​ సాథ్​ చాలా శక్తిమంతమైనది. ఫ్రాన్స్​, పాకిస్థాన్​ కలసి దీనిని తయారు చేశాయి. ఇతర జలాంతర్గాములలా కాకుండా సుదీర్ఘ కాలం పాటు ఇది నీటిలో ఉండగలదు. ఈ విషయం గమనించిన భారత నౌకాదళం ఈ జలాంతర్గామి కోసం వేట మొదలుపెట్టింది.

ఈ పీఎన్​ఎస్​ సాథ్​.. కరాచీ సమీపంలో మాయమైంది. ఇది 3 రోజుల్లో గుజరాత్​ తీర ప్రాంతానికి, 5 రోజుల్లో ముంబయి పశ్చిమ ఓడరేవుకు చేరుకోగలదు. అదే జరిగితే భారత దేశ భద్రతకే పెనుముప్పు తప్పదు.

భారత్​ అవిశ్రాంత వేట..

జలాంతర్గాములను నిలువరించే ప్రత్యేక యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు పాక్​ జలాంతర్గామి కోసం డేగ కన్నుతో వేటాడాయి. పీఎన్​ఎస్ సాథ్​కు ఉన్న కాలచట్రం ప్రకారం, అది వెళ్లగలిగే ప్రదేశాలైన గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలను నౌకాదళం జల్లెడ పట్టిందని సమాచారం. పీ-81యుద్ధ విమానాలూ అన్వేషణ సాగించాయి.

ఒక వేళ కనిపిస్తే...

ఒక వేళ అన్వేషణ ఫలించి పీఎన్ఎస్​ సాథ్​ కనిపిస్తే ఏం చేయాలనే దానిపై నౌకదళానికి స్పష్టమైన ఆదేశాలిచ్చిందట ప్రభుత్వం. భారత ప్రాదేశిక జలాల్లోకి పీఎన్​ఎస్​ సాథ్ ప్రవేశిస్తే బలవంతంగా దానిని తీర ప్రాంతానికి రప్పించి... అవసరమైతే సైనిక చర్యలకు ఉపక్రమించేందుకు భారత్​ సిద్ధమైంది.

మరోవైపు...

ఈ అన్వేషణ కొనసాగిస్తూనే మరోవైపు అణు జలాంతర్గామి ఐఎన్​ఎస్ చక్రను పాకిస్థాన్​ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశింపజేసింది భారత్. పాకిస్థాన్​ ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా చూసేందుకు మన నౌకాదళం అమ్ములపొదిలోకి కొత్తగా చేరిన స్కార్పీన్ తరగతి జలాంతర్గామి ఐఎన్​ఎస్ కల్వరిని మోహరించింది భారత్.

అన్వేషణ తీవ్రం...

రోజులు గడిచేకొద్ది... భారత నౌకాదళం అన్వేషణ తీవ్రతరం చేసింది. పీఎన్​ఎస్​ సాథ్​ను కనిపెట్టడానికి ఉపగ్రహాల సాయం కూడా తీసుకొంది. అయితే కావాలనే పాక్​ ఈ జలాంతర్గామిని ఎక్కడో దాచి ఉంటుందనే సందేహం భారత్​కు ఉందట.

ఎట్టకేలకు చిక్కింది..

21 రోజుల సుదీర్ఘ వేట తర్వాత భారత నావికాదళానికి పీఎన్​ఎస్​ సాథ్​ ఆచూకీ చిక్కింది. పశ్చిమ పాకిస్థాన్​లో ఈ జలాంతర్గామిని దాచి ఉంచింది దాయాది దేశం. ఒక వేళ బాలాకోట్​ దాడుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే... భారత్​ను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతోనే పీఎన్​సాథ్​ను రహస్యంగా పశ్చిమ తీరంలో దాచిపెట్టింది పాక్.

ఇప్పటికీ గస్తీ..

విశ్వసనీయ సమాచారం మేరకు భారత నౌకాదళం అరేబియా సముద్రం, ముఖ్యంగా పాకిస్థాన్​ తీర ప్రాంతంపై, ఆ దేశ నావికాదళం చర్యలపై ఇప్పటికీ ఓ కన్ను వేసి ఉంచిందట.

ఇరు దేశాల మధ్య కాస్త ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ భారత నావికాదళం యుద్ధ విమానం ఐఎన్​ఎస్ విక్రమాదిత్య, యుద్ధ బలగాలు, 60 యుద్ధనౌకలను ఉత్తర అరేబియా సముద్రంపై మోహరించి ఉంచింది.

అరేబియా సముద్రం చుట్టూ భారత నావికాదళం గస్తీ కాస్తున్నందున పాకిస్థాన్ నౌకాదళం మక్రాన్​ తీరప్రాంతంలో తప్ప... మరెక్కడా సముద్రంలోకి వచ్చే సాహసం చేయడం లేదని భారత నావికాదళ ప్రతినిధి డీకే శర్మ ఆనాడు చెప్పారు.

Last Updated : Jun 23, 2019, 8:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details