కశ్మీర్ లోయలోకి ఉగ్రవాదులు చొరబడేలా చేసేందుకు పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేసిందని భారత సైన్యాధికారి వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దయిన ఆగస్టు 5 తర్వాత ఈ ప్రయత్నాలను మరింత పెంచిందని తెలిపారు. కశ్మీర్లోకి చొరబాటుకు యత్నించిన ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు తమ అదుపులో ఉన్నట్లు సైన్యాధికారి కేజేఎస్ డిల్లాన్ చెప్పారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మార్గాల ద్వారా ముష్కరులు చొరబడేందుకు ఆ దేశ సైన్యం ఏర్పాట్లు చేసిందని భారత సైన్యాధికారి పేర్కొన్నారు. తమ అధీనంలో ఉన్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వద్ద పట్టుబడినట్లు వివరించారు. కశ్మీర్లో దాడులు నిర్వహించేందుకు పాక్ సైన్యమే తమని పంపిందని పట్టుబడ్డ మహ్మద్ ఖలీల్, మహ్మద్ నజీం వెల్లడించారని డిల్లాన్ తెలిపారు. వీరిద్దరూ లష్కరే తోయిబా సంస్థలో శిక్షణ తీసుకున్నారని, పాక్ సైన్యం కూడా వీరికి శిక్షణ ఇచ్చి భారత్‌పైకి ఉసిగొల్పిందన్నారు. రావల్పిండికి చెందిన వీరు మరికొంత మంది సహచరుల పేర్లను వెల్లడించినట్లు డిల్లాన్ చెప్పారు.