శీతాకాలం వేళ దేశంలో కరోనా రెండో సారి విజృంభించే అవకాశాలను కొట్టి పారేయలేమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. గడచిన మూడు వారాలుగా దేశవ్యాప్తంగా కొత్త కేసులు తగ్గుముఖం పట్టడం సహా మృతులసంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని ఆయన చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ దాదాపు నియంత్రణలోకి వచ్చినట్లు వివరించారు. అయితే శీతాకాలంలో మరోసారి కరోనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని వీకే పాల్ హెచ్చరించారు.
దేశంలో కోరనా కట్టడి చర్యల కోసం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు పాల్. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశం మొత్తం పంపిణీ చేసేందుకు వ్యవస్థ సిద్ధంగా ఉందని చెప్పారు.
'' దేశంలోని ప్రతిపౌరుడికి వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది. కర్ణాటక, రాజస్థాన్, కేరళ, ఛత్తీస్‌గడ్, బంగాల్‌లో మాత్రమే కొవిడ్ కేసులు కాస్త ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా విషయంలో భారత్ ఇప్పటి వరకు సరిగ్గానే పనిచేసింది.. అయితే ఇంకా చేయాల్సింది చాలానే ఉంది.''