గల్వాన్ లోయ భారత భూభాగంలోనిదేనని పునరుద్ఘాటించింది విదేశాంగ శాఖ. ఈ విషయంపై చారిత్రకంగా ఎంతో స్పష్టత ఉందని గుర్తుచేసింది. ఈ ప్రాంతంపై తమకే హక్కులున్నాయన్న చైనా వాదన సరైనది కాదని తేల్చిచెప్పింది. గల్వాన్ లోయపై చైనా గతంలో ప్రదర్శించిన వైఖరికి తాజా పరిణామాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో సోమవారం భారత్-చైనా సైనికులు మధ్య భీకర ఘర్షణ జరిగింది. చైనా దుస్సాహసానికి 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలోనే గల్వాన్ లోయ తమదేనని భారత విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.
భారత జవాన్ల వల్లే ఘర్షణ తలెత్తిందన్న చైనా ఆరోపణలపైనా విదేశాంగ శాఖ స్పందించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)పై భారత జవాన్లకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది. అన్ని నిబంధనలకు సైన్యం కట్టుబడి ఉందని పేర్కొంది. ఎల్ఏసీ దాటి సైన్యం ఎప్పుడూ కార్యకలాపాలు సాగించలేదని.. ఏం చేసినా వాస్తవాధీన రేఖ పరిధిలోనే చేసిందని తెలిపింది. భారత్ సమకూర్చుకున్న మౌలిక వసతులన్నీ ఎల్ఏసీ లోపలే ఉన్నాయని వెల్లడించింది.
మే 2020 నుంచి భారత సైనికులపై చైనా కయ్యానికి కాలుదువ్వుతోందని.. ఫలితంగానే గల్వాన్ లోయలో హింస చెలరేగిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఏకపక్ష ధోరణితో పరిస్థితులను భారత్ మార్చడానికి చూసిందన్న చైనా వాదనల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పింది.