భారతీయ క్యాథలిక్ క్రైస్తవ సన్యాసిని మరియం థ్రెసియాకు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో క్యాథలిక్ చర్చి మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్.. కేరళకు చెందిన దివంగత సన్యాసిని థ్రెసియాకు ఈ పునీత పట్టాన్ని (సెయింట్‌హుడ్)ను అందించారు. దీని ద్వారా నేటి నుంచి ఆమెను సెయింట్ మరియం థ్రెసియాగా పిలుస్తారు. థ్రెసియాతో పాటు వివిధ దేశాలకు చెందిన మరో నలుగురికి ఈ గౌరవాన్ని అందించారు.
త్రిస్సూర్‌కు చెందిన మరియం సిస్టర్స్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీకి చెందిన క్రైస్తవ మత విభాగాన్ని 1914లో స్థాపించారు. 1876లో క్రైస్తవ్యాన్ని స్వీకరించిన థ్రెసియా.. అనంతరం సన్యాసినిగా మారారు. 1904లో ఒక ప్రత్యేక లక్ష్యంతో తన పేరుముందు మరియం అనే పదాన్ని చేర్చుకున్నారు. 1914లో 'సిస్టర్స్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ' అనే కాన్వెంట్ను స్థాపించారు. 1926 జూన్ 8న 50 ఏళ్ల వయస్సులో పరమపదించారు.
2000 సంవత్సరంలో థ్రెసియాకు ధన్యతా పట్టాన్ని అందించారు నాటి పోప్ రెండో జాన్‌పాల్. ఈ ధన్యతా పట్టం... సెయింట్‌హుడ్ కంటే కొద్దిగా తక్కువ.
మానవసేవలో అంకితభావం, దివంగతురాలైన అనంతరం తనకు ప్రార్థించేవారికి జరిగే స్వస్థతలు సహా స్థానిక చర్చి సిఫారసుల మేరకు అందించే ఈ పునీత పట్టాన్ని మరియం థ్రెసియాకు ఇవ్వాలని 2019 ఫిబ్రవరి 12న నిర్ణయించారు. థ్రెసియా తన జీవిత కాలంలో పాఠశాలల నిర్మాణం, అనాథ శరణాలయాల ఏర్పాటు సహా తాను జీవించి ఉన్న కాలంలో పలు సామాజిక సేవలు చేశారు.