లాక్డౌన్ లక్షలాదిమంది ఉపాధికి గండికొట్టింది. ఆకలి తీరే మార్గం లేని దిక్కుతోచని స్థితిలో పడేసింది. తమిళనాడులో ఓ న్యాయవాదిని సైతం కన్నీళ్లు పెట్టిస్తోందీ లాక్డౌన్. పొట్టకూటి కోసం బుట్టలు అల్లిస్తోంది.
తంజావూర్ జిల్లా, పెరవురని సమీపంలోని తెన్నెన్గుడికి చెందిన ఉత్తమ కుమారన్ (34) పేదరికం పెట్టిన పరీక్షలెన్నో తట్టుకుని, పట్టుదలతో న్యాయవాది అయ్యాడు. పదేళ్లుగా పట్టుకొట్టాయి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ, ఇప్పటికీ ఉత్తమ్‌ను పేదరికం వీడలేదు. అదే పూరి గుడిసెలోనే నివాసం ఉంటున్నాడు. ఇక లాక్డౌన్ దెబ్బకు ఉత్తమ్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. భార్య,బిడ్డల కడుపు నింపే దారిలేక తన కులవృత్తిని నమ్ముకున్నాడు.
ముందు రాళ్లు చెక్కి రోలు తయారు చేశాడు ఉత్తమ్. అయితే, రోలు వ్యాపారానికి గిరాకీ లేకపోయేసరికి.. ఇలా బుట్టలు అల్లడం ప్రారంభించాడు. అడవికి పోయి వెదురు నారలు తీసుకొచ్చి బుట్టలు తయారు చేసి విక్రయిస్తున్నాడు.