పెద్ద సంఖ్యలో భారతీయులు వాయు కాలుష్యం ముప్పును ఎదుర్కొంటున్నారు. సూక్ష్మ ధూళి కణాలు (పార్టిక్యులేట్ మ్యాటర్- పీఎం)గా వ్యవహరించే వాయుకాలుష్య కారకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశిత ప్రమాణాలకన్నా ఎక్కువస్థాయిలో ఉంటున్నాయి. అవి సాధారణ పరిమితికన్నా ఆరు నుంచి ఏడురెట్లు అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఘన ఇంధనాల వినియోగం కారణంగా గృహాల నుంచి కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి.
పరిసర వాతావరణంలోని కాలుష్యానికి దుమ్ము, పారిశ్రామిక రసాయన ఉద్గారాలు, నిర్మాణ పనులు, వాహనాలు, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, పంట వ్యర్థాలు తదితరాలు మూల వనరులుగా నిలుస్తున్నాయి. వీటిలో అతి సూక్ష్మమైన ఘన, ద్రవ రేణువులూ ఉంటున్నాయి. కాలుష్య కారకాలను సూక్ష్మ ధూళి కణాల పరిమాణం, వ్యాసం ఆధారంగా పీఎం 2.5, పీఎం 10గా వర్గీకరించి చెబుతారు. 2.5 మైక్రాన్లకన్నా తక్కువ పరిమాణంలో ఉండే కాలుష్య కారకాలను పీఎం 2.5గా, 10 మైక్రాన్లకన్నా తక్కువ పరిమాణంలో ఉండే కాలుష్య కారకాలను పీఎం 10గా వ్యవహరిస్తారు. పీఎం 2.5 ఉద్గారాల్ని అత్యధికంగా వెలువరించే దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. గాలిలో పీఎం 2.5 గాఢతలో భారత వార్షిక సగటు 2018లో ప్రతి ఘనపు మీటరు గాలిలో 72.5 మైక్రోగ్రాములుగా ఉంది.
డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన సగటు 10 మైక్రోగ్రాములు మాత్రమే. బంగ్లాదేశ్‌లో ఉద్గారాల రేటు అత్యధికంగా 97.1 (మైక్రోగ్రాములు... ప్రతి ఘనపు మీటరుకు). పాకిస్థాన్ 74.3 రేటుతో రెండోస్థానంలో నిలిచింది.
గుండె, ఊపిరితిత్తుల సమస్యలు
వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాణాల ప్రకారం పీఎం రేటు 55.5 నుంచి 150.4 మధ్య ఉంటే ‘అనారోగ్యకరం’గా వర్గీకరించారు. ఈ పరిధిలో ఉండే ప్రజలకు పలు దుష్ప్రభావాలతో పాటు, గుండె, ఊపిరితిత్తుల సమస్యల ముప్పు పొంచి ఉంటుంది. దేశంలోని చాలా ప్రాంతాలు పీఎం 2.5 ఉద్గార రేటు 72 నుంచి 135 మధ్య ఉండటంతో, అవన్నీ అనారోగ్యకర పరిధిలో ఉన్నాయనేది సుస్పష్టం. కాలుష్య కారక పరిశ్రమలు, అధికారులు, నియంత్రణ బోర్డుల నుంచి సరైన వ్యూహాలు లేకపోవడం; కఠిన నియంత్రణలు, పర్యవేక్షణ లోపించడం వంటివి దేశంలో వాయు నాణ్యత క్షీణించిపోవడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. భారత వాయు కాలుష్య పీఎం గాఢత ప్రాణాంతక స్థాయికి చేరింది.
ప్రాణముప్పు కారకం
ప్రపంచ వాయు స్థితిగతుల పేరిట ఈ ఏడాది వెలువడిన ఓ నివేదిక ప్రకారం... 2017లో మరణానికి, వైకల్యానికి కారణమైన అయిదు అగ్రస్థాయి ముప్పుకారకాల్లో వాయు కాలుష్యం కూడా ఉంది. పోషకాహార లోపం, మద్యపానం, శారీరక శ్రమ లోపించడం వంటి అందరికీ తెలిసిన ముప్పు కారకాలకన్నా, వాయుకాలుష్యమే ఎక్కువ మరణాలకు కారణమైనట్లు తేలింది. ఏటా, రహదారి ప్రమాదాల గాయాలు లేదా మలేరియాతో పోలిస్తే, వాయు కాలుష్యంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా అయిదో అత్యధిక ప్రాణాంతక ముప్పు కారకమని ఆ నివేదిక పేర్కొంది. ఇది 2017లో 49 లక్షల మరణాలకు కారణమైనట్లు వివరించింది.