తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్టార్టప్​: మోదీ చర్యలు X రాహుల్​ హామీలు - భాజపా

'యువత ఉద్యోగాలు అడిగే స్థాయిలో కాదు... ఇచ్చే స్థాయిలో ఉండాలి"... ప్రధాని నరేంద్రమోదీ తరచూ చెప్పే మాట ఇది. ఈ కల సాకారం అయ్యేందుకు ఉన్న ప్రధాన మార్గం... స్టార్టప్​. అంకురాల కోసం ఎన్నో ప్రకటనలు చేసింది ఎన్డీఏ సర్కార్. వాటిలో ఎన్ని అమలయ్యాయి? స్టార్టప్​లకు ఇంకేం కావాలి? రాహుల్​ ఇచ్చిన హామీలపై ఆయా సంస్థల మాటేంటి?

స్టార్టప్​: మోదీ చర్యలు X రాహుల్​ హామీలు

By

Published : Apr 1, 2019, 6:13 AM IST

స్టార్టప్​: మోదీ చర్యలు X రాహుల్​ హామీలు

స్టార్టప్​ ఇండియా... నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం. స్వయం ఉపాధి విషయంలో యువతను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యం. అంకుర సంస్థల ఏర్పాటు, నిర్వహణను సులభతరం చేసేలా మొదట్లో ఎన్నో ప్రకటనలు చేసింది కేంద్రం.

ఎన్నికలకు కొన్ని నెలల ముందు అంకుర సంస్థలకు కేంద్రం నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. స్టార్టప్​లలో పెట్టిన పెట్టుబడులపై పన్ను(ఏంజెల్ ట్యాక్స్​) చెల్లించాలన్నది వాటి సారాంశం.

ఏంజెల్ ట్యాక్స్​ విధించాలని 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అమలు కాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఎన్డీఏ సర్కారు పన్ను నోటీసులు ఇవ్వడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత అంకురాలకు కాస్త ఊరట కలిగించేలా నిబంధనల్లో మార్పులు చేసింది కేంద్రం.

ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ అంకురాలపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే అంకురాలకు పన్ను రాయితీతో పాటు మూడు సంవత్సరాల వరకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా పనిచేసుకునే విధంగా చూస్తామని ప్రకటించారు.

అంకురాలకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రాహుల్​ హామీలు, అధికారంలోకి వచ్చే ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న అంశాలపై బెంగళూరుకు చెందిన ఏంజెల్ ఇన్​వెస్టర్​ గణేశ్​తో ఈటీవీ భారత్​ మాట్లాడింది.

ఏంజెల్ పన్నులో చాలా మార్పులు వచ్చాయి. దీనిపై మీ అభిప్రాయం?

2012 ఈ అమానుషమైన ఏంజెల్​ పన్ను ప్రారంభించారు. ఇది ఎందుకు అమానుషమైనదంటే... ఏంజెల్​ మదుపరులు పెట్టిన పెట్టుబడులపై పన్ను విధించటం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇది అంకురాలకు నష్టం కలిగిస్తుంది. వ్యాపార దృక్పథాన్ని దెబ్బతీస్తుంది. కానీ అదృష్టవశాత్తూ గత 3 నెలల నుంచి డీఐపీపీ, సీబీడీటీ సహా పలు నిర్ణయాత్మక సంస్థలు వివిధ రౌండ్​ టేబుల్​ సమావేశాలు నిర్వహించాయి. నేను అలాంటి మూడు సమావేశాల్లో పాల్గొన్నాను. గుణాత్మక విధాన మార్పులను డీఐపీపీ తీసుకొచ్చింది. వీటివల్ల ఒకదాని తరవాత ఒకటి దాదాపు 99 శాతం ఏంజెల్​ పన్ను సవాళ్లు తొలిగిపోయాయి. పన్నును పూర్తిగా తొలిగించలేదు కానీ 99 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయి.

ఏంజెల్​ పన్ను రద్దు అయ్యే దశలో ఉందని చెప్పవచ్చు. రాహుల్​గాంధీ ఈ పన్నును రద్దు చేస్తామని చెప్పారు. మరికొన్ని హామీలు ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?

అంకురాలు, వ్యవస్థాపకత, యువత కంపెనీలు స్థాపించేందుకు సులభతర విధానం లాంటి అంశాలపై రాహుల్​గాంధీ మాట్లాడటం చాలా మంచి పరిణామం. ఒక్కసారి వెనక్కి వెళ్తే ఏ ఎన్నికల్లోనూ అంకురాలు, వ్యవస్థాపక రంగం గురించి మాట్లాడిన పార్టీని నేను చూడలేదు. రెండు ప్రధాన పార్టీలు అంకురాల గురించి మాట్లాడటం ఒక స్వాగతించదగిన పరిణామం. వాస్తవానికి అంకురాలే ఉద్యోగాలు సృష్టిస్తాయి. దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించాలంటే అంకురాలకు ప్రోత్సహకాలు ఉండటం అవసరం. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయి. మరో పార్టీ , రాహుల్​గాంధీ వీటి గురించి మాట్లాడటం మంచి పరిణామం.

ఒకటి రెండు శాతం మినహా ఏంజెల్​ పన్ను సమస్యకు అటుఇటుగా పరిష్కరం దొరికినట్లే. రాహుల్​ గాంధీ ఇచ్చిన ఇతర ప్రకటనలు స్వాగతించదగినవి. మూడేళ్ల వరకు అంకురాలకు ఎలాంటి నిబంధలు ఉండవు అనేది ఆయన చెప్పిన వాటిలో ఒకటి. ఇదొక వివేకవంతమైన చర్య. ఎందుకంటే 90% అంకురాలు విఫలమవుతాయి. పదింటిలో 9 విఫలమౌతున్నప్పటికీ... జీఎస్టీ, డీఐపీపీ రిజిస్ట్రేషన్​, పాన్​ నంబరు లాంటి వాటికోసం కష్టపడాల్సి వస్తోంది. దీనివల్ల ఉత్పాదక సమయం కోల్పోవాల్సి వస్తోంది. అంకురాలు చాలా చిన్నగా ఉన్నప్పుడు నిబంధనలు ఉండకూడదు. మొదట వాటిని విజయం సాధించి ఒక ఆకృతికి రానివ్వండి. ఈ స్థాయి అనంతరమే నియమ నిబంధనలు పరిధిలోకి వీటిని తీసుకురండి. ఇది ఒక మంచి చర్య.

ఆయన(రాహుల్​గాంధీ) మాట్లాడిన వాటిలో రెండోది... పన్ను రాయితీ. ఇది ఇప్పటికే అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరిస్తున్న పద్దతి. ఏంజెల్స్​పై పన్ను విధించటానికి పూర్తి వ్యతిరేకంగా పన్ను రాయితీ ఉండాలి. ఉద్యోగాలు సృష్టించే అంకురాల్లో పెట్టుబడి పెడితే పన్ను ప్రోత్సాహకాలు, ఉద్యోగాల సృష్టి ఆధారంగా పన్ను రాయితీ ఇవ్వటం లాంటి చర్యలు తీసుకోవాలి. ఇది చాలా మంచి పరిణామం అవుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీటిని అమలు చేస్తుందని ఆశిస్తున్నా.

భాజపా నుంచి కూడా ఇలాంటి హామీలనే ఆశిస్తున్నారా?

అవును ఆశిస్తున్నా. గత 4 ఏళ్లలో అంకురాలకు సంబంధించి భాజపా అసాధారణ చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఏంజెల్​ పన్నును 99 శాతం తొలిగించారు. వాళ్లు తీసుకొచ్చిన విధానాలు, నియమనిబంధనలను క్షేత్రస్థాయిలో అమలయ్యే విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఇది ఎన్నికల సమయం. మ్యానిఫెస్టో అన్ని వర్గాలను ఆకట్టుకోవాలి. మరిన్ని హామీలు స్వాగతించదగినవే. కానీ ఇప్పటికే వాళ్లు చాలా మంచి చర్యలు తీసుకున్నారు. వాటిని అమల్లోకి తీసుకువచ్చినా సరిపోతుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దేశంలో ఉద్యోగాలకు, వృద్ధికి తప్పనిసరిగా అవసరమైన అంకురాలపై దృష్టి సారిస్తాయని అశిస్తున్నాం.

ABOUT THE AUTHOR

...view details