స్ట్రాంగ్‌రూంల్లో భద్రపరిచిన ఈవీఎమ్లలో టాంపరింగ్ జరిగిందని వస్తోన్న వార్తలను ఎన్నికల సంఘం ఖండించింది. పోలింగ్‌లో వాడిన ఈవీఎమ్‌లు అన్నీ స్ట్రాంగ్ రూంల్లో సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఈవీఎమ్‌ల టాంపరింగ్‌పై వస్తోన్న వార్తలు వదంతులేనని ఈసీ తెలిపింది. వీడియోల్లో కనిపిస్తోన్న ఈవీఎమ్‌లు ఎన్నికల్లో వాడినవి కావని రూఢి చేసింది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత అన్ని ఈవీఎమ్‌లు, వీవీప్యాట్లు సీల్‌వేసి, పటిష్ఠ భద్రత నడుమ స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచామని ఈసీ తెలిపింది. పోలింగ్ అధికారులతోపాటు వివిధ పార్టీల అభ్యర్థుల సమక్షంలోనే ఇదంతా నిర్వహించామని ఈసీ తెలిపింది. ఈ తతంగాన్ని అంతా వీడియోలో రికార్డ్ చేసినట్లు వివరించింది.
ఓట్ల లెక్కింపు జరిగే వరకు సీసీటీవీ ద్వారా నిత్యం పర్యవేక్షణ జరుగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది. 24 గంటలూ కేంద్ర సాయుధ బలగాలు కాపలాగా ఉంటున్నారని, వారితో పాటు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులూ అక్కడే ఉంటున్నారని స్పష్టం చేసింది.
ఓట్ల లెక్కింపు జరిగే రోజు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే స్ట్రాంగ్‌రూంలు తెరుస్తామని ఈసీ తెలిపింది. ఓట్ల లెక్కింపు మొదలుపెట్టే ముందు ఈవీఎమ్‌ల అడ్రస్ టాగ్లు, సీల్స్, సీరియల్ నెంబర్లను పోలింగ్ ఏజెంట్లకు చూపుతామని ఈసీ వివరించింది.