సార్వత్రిక సమరం ఐదో దశ సమాప్తం సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 7 రాష్ట్రాల్లోని 51 నియోజవర్గాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 63.56 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.
ఈ విడతలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు పోటీలో నిలుచున్నారు.
రాష్ట్రాల వారీగా ఓటింగ్ శాతం...
బంగాల్ - 74.42 శాతం
ఝార్ఖండ్ - 63.72 శాతం
మధ్యప్రదేశ్ - 63.88 శాతం
ఉత్తరప్రదేశ్ - 57.33 శాతం
బిహార్ - 57.86 శాతం
రాజస్థాన్ - 63.78 శాతం
అనంత్‌నాగ్ - 8.76 శాతం
లద్దాఖ్ - 71.10 శాతం
కశ్మీర్లో గ్రెనేడ్ పేలుడు
జమ్ముకశ్మీర్‌లో ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ పోలింగ్ కేంద్రంపై గ్రెనేడ్ దాడి జరిగింది. పుల్వామా జిల్లాలోని రోహ్మోలో ఓటర్లను భయభ్రాంతులను గురిచేసేందుకే ఉగ్రవాదులు దాడి జరిపి ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
ఆందోళనలు నెలకొన్నా.. పటిష్ఠ భద్రత మధ్య పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
బంగాల్లో అదే తీరు..
బంగాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక సమస్య కారణంగా ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
బరాక్పుర్లో భాజపా అభ్యర్థి అర్జున్ సింగ్, కేంద్ర బలగాలకు మధ్య వాగ్వాదం జరిగింది. తృణమూల్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, మళ్లీ పోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు భాజపా నాయకులు.
హుగ్లీలోని బెల్మూరి బూత్‌లో పోలింగ్ అధికారిని ఓ భాజపా అభ్యర్థి బెదిరించారు. తారక్స్వర్ పోలింగ్ కేంద్రంలో అందరి ఓట్లను టీఎంసీ నేత ఒక్కరే వేస్తున్నారన్న ఆరోపణలతో ప్రిసైడింగ్ అధికారిని తొలగించారు.
బిహార్‌లో ఈవీఎం ధ్వంసం
బిహార్ ఛప్రాలోని 131వ నెంబరు కేంద్రంలో ఓ వ్యక్తి ఈవీఎంను ధ్వంసం చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓటింగ్‌లో ప్రముఖులు
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులుదీరారు ఓటర్లు. పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యారు.
మే 12, 19న ఆరు, ఏడు దశల పోలింగ్ జరగనుంది. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితం వెలువడనుంది.