తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలస కార్మికుల చుట్టూ తిరుగుతున్న రాజకీయం! - politics on migrants latest editorial

కరోనా కారణంగా వలస శ్రామికుల కష్టాలు గుండెల్ని మెలిపెడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించడం వల్ల గూడు చెదిరి, పరాయి రాష్ట్రాల్లో అనాథలుగా చనిపోతామేమోనన్న భయంతో.. సొంతూళ్లకు దూరభారాలు లెక్కచెయ్యకుండా వెళ్తున్న వలస కూలీల చుట్టూ దుర్రాజకీయాలు నెలకొంటున్నాయంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా నేపథ్యంలో వారి కష్టాలు, కన్నీళ్లపట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృక్కోణం మరింత మానవీయంగా ఉండాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తుచేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.

Politics revolving around migrant workers said experts
వలస కార్మికుల చుట్టూ తిరుగుతున్న రాజకీయం!

By

Published : May 31, 2020, 8:17 AM IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రెండు దశాబ్దాల్లో నడిచింది జన రాజకీయం. దాని వెన్నంటి వ్యక్తిపూజ సంస్కృతిని గట్టిగా నినదిస్తూ సాగింది భజన రాజకీయం. దాని కుదుళ్లు కోసుకుపోయిన దశ నుంచే పిలక వేసింది విభజన రాజకీయం. ప్రజాస్వామ్యం అంటే- ‘ప్రజల పేరిట, పదవి కోసం’ అన్న విస్పష్ట అజెండాకు గొడుగు పడుతూ, కులమత వర్గలింగ భాషా ప్రాంత ప్రాతిపదికలపై ప్రజల్ని విభజించి పబ్బం గడుపుకోవడం నయా రాజకీయంగా రంగులద్దుకొంది. కరోనా మహమ్మారి ప్రజల బతుకును బతుకు తెరువునూ ఒక్క తీరుగా దెబ్బతీసిన తరుణంలో వలస శ్రామికుల కష్టాలు గుండెల్ని మెలిపెడుతున్నాయి. సమస్త ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడంతో గూడుచెదిరి, పరాయి రాష్ట్రంలో అనాథలుగా పోతామేమోనన్న బెదురుతో గుండె పగిలి సొంతూళ్లకు దూరాభారాలు లెక్కచేయకుండా కదిలిన వలస కూలీల చుట్టూ దుర్రాజకీయాలు ముసురుకొంటున్నాయి. ఆ వివరం చిత్తగించండి!

యోగీ మాటలు ఆమోదయోగ్యమేనా?

ఉన్న ఊళ్లో నాలుగు రాళ్లు సంపాదించుకొనే వెసులుబాటు లేక బిహార్‌, ఒడిశా, పశ్చిమ్‌ బంగ, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ల నుంచి ఏటా వలసలు ముమ్మరిస్తుంటాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళలకు ఆ తరహా వలసలు పోటెత్తుతుంటాయి. కొవిడ్‌ నేపథ్యంలో స్వరాష్ట్రాలకు చేరిన వలస కూలీల్లో యూపీ బిహార్‌లదే మెజారిటీ. తమ రాష్ట్రానికి చెందినవారిని తక్కిన రాష్ట్రాలు సక్రమంగా సమాదరించలేదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కోపం వచ్చింది. యూపీ చేరిన వలస శ్రామికుల సంఖ్య పాతిక లక్షలు దాటిపోవడంతో- అంతటి బృహత్తర మానవ వనరుల్ని రాష్ట్ర కల్యాణానికే వినియోగించుకోవాలన్న ఏలినవారి ఆలోచన మెచ్చదగిందే. అందుకోసం 'మైగ్రెంట్స్‌ కమిషన్‌'ను కొలువుతీర్చి, వలస కూలీల నైపుణ్యాలను శాస్త్రీయంగా గుర్తించి, వారిని వివిధ పరిశ్రమలకు అనుసంధానించదలచిన ముఖ్యమంత్రి- వేరే రాష్ట్రాలు ఏవైనా యూపీ కార్మికులు కావాలనుకొంటే, మొదట తమ అనుమతి పొందాల్సి ఉంటుందని ప్రకటించారు. ఇంతకాలం ఏలినవారి అనుమతితోనే సాగాయా వలసలు?ఆ తరహా వచోవిన్యాసాలకు మహారాష్ట్రలో థాక్రేలు పెట్టింది పేరు.

మహారాష్ట్ర మహారాష్ట్రీయులదేనంటూ భూమిపుత్రుల నినాదంతో పుట్టిన శివసేన గాండ్రింపులు తెలియనివి కావు. శివసేన ఆధిపత్యం దక్కకపోయేసరికి నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్‌) పేరిట పార్టీ పెట్టుకొన్న రాజ్‌థాక్రేకు యూపీ ముఖ్యమంత్రి ప్రకటన అయాచిత వరమైంది. భూమి పుత్రులకు- బయటివారికి మధ్య విభజన రేఖలు గీసి రాజకీయ చిచ్చురాజేసి పుష్కరకాలం క్రితమే స్వీయ‘సామర్థ్యం’ నిరూపించుకొన్న ఘన చరిత్ర రాజ్‌ థాక్రేది! హిందీ రాష్ట్రాల నుంచి వలసవచ్చి ముంబయిలో ఉంటున్నవారు మహారాష్ట్ర సంస్కృతినే మన్నించాలని, ఛాత్‌పూజ జరుపుకోరాదనీ ఆనాడు గర్జించిన రాజ్‌థాక్రే- నేడు యోగి ఆదిత్యనాథ్‌ మాటల్ని పట్టుకొని వలసదారులకు ఫర్మానాలు జారీ చేశారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వలస శ్రామికులు స్థానిక పోలీసు ఠాణా నుంచి ప్రభుత్వం నుంచే కాదు తన పార్టీ నుంచీ అనుమతి పొందాలని తీర్మానించారు. పైత్యం ప్రకోపిస్తే తన్నుకొచ్చే మాటలవి. ఆదిలోనే తుంచకుంటే, అవే విద్వేష తూటాలవుతాయి!

ఎవరూ నియంత్రించలేరు..

'భారత ప్రజలమైన మేము...' అంటూ రాసుకొన్న రాజ్యాంగంలోని 19వ అధికరణ ఈ దేశపౌరులందరికీ ఏ రాష్ట్ర పాలకుల దయాధర్మంతో నిమిత్తంలేని విస్తృత హక్కును ప్రసాదించింది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా, స్వేచ్ఛగా సంచరించే, నివసించే, స్థిరనివాసం ఏర్పరుచుకొనే స్వేచ్ఛను అది కల్పించింది. ఆ పౌరహక్కుకు గ్రహణం పట్టించడానికి అడపాదడపా కొన్ని కుయత్నాలు సాగినా, తెలిమబ్బుల్లా అవన్నీ తేలిపోయాయి. అంతర్రాష్ట్ర వలసలకు సంబంధించి 1979లోనే ఓ చట్టం రూపుదాల్చింది. ఆ చట్టం ప్రకారం వలస కూలీల్ని పనిలో పెట్టుకొనే కాంట్రాక్టర్లు తమ స్వరాష్ట్రంలోనే కాదు, కూలీల్ని పంపే రాష్ట్రం నుంచీ లైసెన్సు పొందాల్సి ఉంటుంది. అంతేగాని, అనుమతి పొందాలన్న నిబంధనేదీ లేదు. ఆ సంగతి ఆలస్యంగా బోధపడిందో ఏమో- మైగ్రెంట్స్‌ కమిషన్‌ నిబంధనల్లో రాష్ట్రప్రభుత్వ అనుమతిని చేర్చబోమని యోగి సర్కారు మాట మార్చింది. దశాబ్దాలుగా వెనకబాటుతనానికి పెట్టింది పేరుగా, జీవన ప్రమాణాల సూచీల్లో పరమనాసిగా భ్రష్టుపడుతున్న రాష్ట్రాల నుంచి బతుకుతెరువు కోసం సాగుతున్న వలసల్ని ఏ ప్రభుత్వం మాత్రం బలవంతంగా నియంత్రించగలుగుతుంది?

యాభై లక్షలమందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందాలన్న ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ చొరవ మెచ్చదగిందే. ‘ఊళ్లో రోజు కూలీ రూ.200. అదే హరియాణాలో రూ.360-500 గిట్టుబాటు అవుతోంది’ అన్న వలస కూలీ బతుకు లెక్కా అర్థవంతమైనదే. బీమా, సామాజిక భద్రత, కొత్త ఉపాధికి తోడ్పాటు, నిరుద్యోగ భృతికి అవకాశం వంటివి వలసకూలీలకు కల్పించే లక్ష్యంతో ‘మైగ్రెంట్స్‌ కమిషన్‌’ను కొలువుతీర్చాలనుకోవడం మంచి నిర్ణయమే. సంస్కరణల శకంలో దేశార్థిక రథానికి వలస శ్రామికులే ఇరుసుగా మారిన వైనాన్ని అధ్యయనం చేసి మొత్తంగా జాతీయ స్థాయిలోనే చేపట్టదగు సంక్షేమ కార్యాచరణ అవశ్యం పట్టాలకెక్కాల్సిందే. పది కోట్లమంది వలస కూలీల కాయకష్టం, స్థూల దేశీయోత్పత్తిలో 10 శాతం సృష్టిస్తోందని అధ్యయనాలు చాటుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయుల సంఖ్యకు నాలుగింతలుగా అంతర్దేశీయ వలస శ్రామికులు దేశ జీడీపీలో ఆరు శాతం మొత్తాన్ని సంపాదిస్తున్నారు. అందులో మూడోవంతు మొత్తాన్ని సొంతూళ్లకు (ప్రధానంగా ఉత్తర భారతావని)కి పంపడం ద్వారా సంపద బదిలీ సేతువులుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. కరోనా నేపథ్యంలో వారి కష్టాలు కన్నీళ్లపట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృక్కోణం మరింత మానవీయంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్న గణాంకాలివి!

మహాకవి చెప్పినట్లు వ్యక్తికి బహువచనం శక్తి. ఆ శక్తి విరాట్‌ రూపమైన వలస శ్రామికుల్ని రాజకీయ సులోచనాల్లో నుంచి చూసి రాష్ట్రాలవారీగా విభజించడం కాదు, చెయ్యాల్సింది. ఆ రెక్కలకు కొత్త సత్తువ దక్కేలా, ఆ కళ్లల్లో కొండల్ని పిండి చేసే ధీమా మళ్ళీ మోసులెత్తేలా సామాజిక భద్రతా విధానాల్ని దేశవ్యాప్తం చెయ్యాలి. ఏమంటారు?

-పర్వతం మూర్తి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details