తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఏఏ'తో శరణార్థుల చుట్టూ రాజకీయ వ్యూహాలు - nrc latest news

దేశంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. మరో వైపు రాజకీయ పార్టీలు వీటిని అనేక విధాలుగా తమ ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. బంగాల్​ ముఖ్యమంత్రి మమత ఆందోళన పథంలో సాగుతూ, కోల్‌కతాతోపాటు జిల్లాల్లోనూ వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. అయితే.. రానున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పౌరచట్టం, ఎన్​ఆర్​సీనే ప్రభావం చూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ శరణార్థుల చుట్టూరానే దేశ రాజకీయాలు నడుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Politicians around refugees in the country
దేశంలో శరణార్థుల చుట్టూ రాజకీయ నాయకులు

By

Published : Jan 4, 2020, 8:20 AM IST

సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ్‌ బంగ, త్రిపుర, అసోమ్‌లలో రాజకీయ ప్రకంపనలు తలెత్తడానికి అవసరమైన అంశాలన్నీ పౌరసత్వ సవరణ చట్టం, 2019 (సీఏఏ)లో ఉన్నాయి. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి 2014 డిసెంబర్‌ 31లోపు భారత్‌లోకి వచ్చిన అక్రమ వలసదారుల్లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వం కల్పించాలనే లక్ష్యంతో తాజా సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం, కనీసం పదకొండేళ్లుగా భారత్‌లో నివసిస్తున్నవారు పౌరసత్వానికి అర్హులు. సవరించిన చట్టం సదరు మూడు దేశాల నుంచి వచ్చే ఆరు మతాలకు చెందిన వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు అవసరమైన కాలవ్యవధిని అయిదేళ్లకు తగ్గించింది. దీంతో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యధిక స్థాయిలో వలస రేట్లు నమోదైన పశ్చిమ్‌ బంగలో అలజడి మొదలైంది.

పట్టుకోసం ప్రయత్నాలు

బంగ్లాదేశ్‌తో 2,216.7 కి.మీ., నేపాల్‌తో 96 కి.మీ.మేర ఉన్న సరిహద్దులు కట్టుదిట్టంగా లేకపోవడంతో పశ్చిమ్‌ బంగలోకి పొరుగు దేశం నుంచి జనం రాక సాగుతూనే ఉంది. పశ్చిమ్‌ బంగలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు శరణార్థుల పునరావాస చర్యల కోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్నే ఏర్పాటు చేసింది. ఆ తరవాత ప్రభుత్వం మారినా వలసలు ఆగలేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం కింద 2019, నవంబర్‌లో 92 శరణార్థుల కాలనీలను క్రమబద్ధీకరించింది. భారీ స్థాయిలో శరణార్థుల జనాభా ఉండటంతో సీఏఏ తమకు ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తుందేమోనన్న ఆందోళన ముస్లిం వర్గాల్లో నెలకొంది.

పశ్చిమ్‌ బంగ సీఎం మమతాబెనర్జీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ తమను కాపాడతాయని వారు ఆశలు పెట్టుకున్నారు. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో భాజపా బాగా పుంజుకొంది. తృణమూల్‌ నుంచి 14 సీట్లను కైవసం చేసుకున్న భాజపా మొత్తంగా 18 స్థానాల్ని సాధించింది. అప్పటి నుంచి ఉత్తర బంగ ప్రాంతంలో మమతా బెనర్జీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఓట్లశాతాన్ని మరింతగా పెంచుకుని 2021 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాలని కమలం పార్టీ ఉవ్విళూరుతోంది. తృణమూల్‌కన్నా కేవలం మూడు శాతం ఓట్లతో భాజపా వెనకంజలో ఉంది. అయితే, ఈ ఫలితాలు అసోమ్‌లో జాతీయ పౌర పట్టీ(ఎన్‌ఆర్‌సీ) సమాచారం బయటికి రాకముందు వచ్చినవి. తరవాత ఎన్‌ఆర్‌సీలో 19 లక్షలమందికి చోటుదక్కకపోవడంపై మమత భాజపాను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక సామాజిక వర్గంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏల వల్ల లక్షల మంది పౌరసత్వం విషయంలో గందరగోళం ఏర్పడుతుందన్నారు. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉండే 80 దాకా అసెంబ్లీ నియోజక వర్గాలు మమతకు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. మునుపటి తూర్పు పాకిస్థాన్‌, ప్రస్తుత బంగ్లాదేశ్‌ నుంచి వెల్లువలా వచ్చిన వలసదారులు ఈ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఏ ఎన్నికల్లోనైనా గెలుపోటముల్లో నిర్ణయాత్మక పాత్ర వీరిదే.

2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ్‌ బంగలో ముస్లిముల జనాభా సుమారు 27 శాతం. ప్రస్తుతానికి 30 శాతానికి చేరి ఉండొచ్చు. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 130 స్థానాల్లో ముస్లిముల ఓట్లు గణనీయ ప్రభావం చూపనున్నాయి. లోక్‌సభ ఫలితాల విశ్లేషణ ప్రకారం ఈ 130 స్థానాల్లో 90లో తృణమూల్‌దే పైచేయిగా ఉంది. ముస్లిం ఓటర్లలో మమతకున్న ఆదరణ చెక్కుచెదరలేదనేందుకు ఇది గట్టి ఉదాహరణ. అయితే, భాజపా 40 శాతందాకా సాధించిన ఓట్లు రాష్ట్ర రాజకీయాల్లో పునరేకీకరణను ధ్రువీకరిస్తున్నాయి. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు భాజపాకు కీలకంగా మారతాయనే అభిప్రాయాలున్నాయి. రాష్ట్రంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ భారీస్థాయిలో ఆందోళనలు జరుగుతుండటంతో, ప్రస్తుతానికైతే హిందూ శరణార్థులు ఎలాంటి సంబరాలు చేసుకోకుండా చాలావరకు మౌనంగా ఉండిపోయారు. కొంతమంది హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో పరిస్థితులు కాల్పులకు దారితీశాయి.

మమత ఆందోళన పథంలో సాగుతూ, కోల్‌కతాతోపాటు జిల్లాల్లోనూ సభలు నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో పరిస్థితులు మమతకు మరీ సానుకూలంగా లేవు. బంగ్లాదేశ్‌ నుంచి శరణార్థుల్లా వచ్చిన మథువా వర్గం 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకంగా మారింది. తమకు పౌరసత్వం కల్పించాలనేది వీరు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌. వీరి ఆకాంక్షలపై భాజపా ఆశలు కల్పించిన ఫలితంగానే బోంగావ్‌, రణఘాట్‌ లోక్‌సభ స్థానాల్లో తృణమూల్‌ను మట్టికరిపించింది. ఈ రెండు స్థానాలూ గతంలో తృణమూల్‌ గెలిచినవే. మథువా వర్గాన్ని బుజ్జగించేందుకు మమత, ఆమె పార్టీ సీనియర్‌ నేతలు చేసిన యత్నాలేవీ ఫలించలేదు. ఆ సామాజిక వర్గం గతంలో వామపక్షాల వెనక, తృణమూల్‌ వెనక తరవాత భాజపాను అనుసరిస్తోంది. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చి పశ్చిమ్‌ బంగలో ఉంటున్న 2.5 కోట్లమంది ఓటర్లపై భాజపా ఆశలు పెట్టుకుంది. సీఏఏ ద్వారా పౌరసత్వం, చట్టబద్ధతను కల్పిస్తుండగా, తృణమూల్‌ వ్యతిరేకిస్తోందనే సందేశాన్ని భాజపా విజయవంతంగా వ్యాప్తి చేసినట్లయింది.

ప్రధాన ప్రచారాస్త్రం

సీఏబీ, ఎన్‌ఆర్‌సీలను గట్టిగా వ్యతిరేకించడం ద్వారా మమతా బెనర్జీ ఇప్పటికే ప్రయోజనాలు పొందారు. 2019 నవంబర్‌ ఉప ఎన్నికల్లో పోటీ జరిగిన మూడు స్థానాలనూ కైవసం చేసుకున్నారు. అందులో రెండు స్థానాలను భాజపా నుంచి తన ఖాతాలో వేసుకోవడం విశేషం. డార్జిలింగ్‌ కొండల్లో గూర్ఖాలు తృణమూల్‌ అవకాశాల్ని మలుపుతిప్పే అవకాశం ఉంది. అసోమ్‌లో 19 లక్షలమందికి ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కలేదనే అంశాన్ని ఉత్తర బంగలో ఒక భాగంలోనైనా మమత తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేక ఆందోళనల తరవాత కొండప్రాంతంలో తృణమూల్‌కు కొంత మొగ్గు పెరిగే అవకాశం లేకపోలేదు. పశ్చిమ్‌ బంగలో ఎన్‌ఆర్‌సీ కసరత్తును వ్యతిరేకిస్తూ సామాజిక, రాజకీయేతర, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. సీఏఏను ఏ రూపంలోనూ అమలు చేసేది లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పష్టీకరించింది. ఉప ఎన్నికల్లో గెలుపు రుచి చూసిన మమత 2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేకతనే ప్రధానంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. పశ్చిమ్‌ బంగ ఓటర్లు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను ఆమోదిస్తారా, వ్యతిరేకిస్తారా, తృణమూల్‌ స్థానిక నేతలు ప్రభుత్వ పథకాల అమలులో ‘కట్‌మనీ’ తీసుకుంటారనే ఆరోపణల్ని జనం మరచిపోతారా, ఏఐఎంఐఎం ప్రవేశంతో ముస్లిం ఓట్లలో తలెత్తే చీలికను మమత అడ్డుకోగలుగుతారా, భాజపా తన స్థానాన్ని మరింతగా సుస్థిరం చేసుకోగలదా... ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చాలావరకు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపైనే ఆధారపడి ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో వీటికి జవాబులు తెలుస్తాయి.
- దీపాంకర్​ బోస్​

ABOUT THE AUTHOR

...view details