జమ్ముకశ్మీర్లో రోష్ని చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని అక్కడి హైకోర్టు ప్రకటించిన అనంతరం.. లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది యంత్రాంగం. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా పేర్లు ఉన్నాయి. వారి నివాసాలు అక్రమ భూముల్లో నిర్మించుకున్నారని యంత్రాంగం స్పష్టం చేసింది. వాటితో పాటు శ్రీనగర్, జమ్ములో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయాలు కూడా అక్రమ భూముల్లోనే నిర్మించారని పేర్కొంది.
'దోచుకున్నారు..'
జమ్ముకశ్మీర్లో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న తురుణంలో.. లబ్ధిదారుల జాబితాలో ఎన్సీ నేతల పేర్లు ఉండటం తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. 1998లో ఫరూక్.. 3కెనాళ్ల భూమి(1 కెనాల్- 505 స్క్వేర్ మీటర్లు)ని కొనుగోలు చేసి 7కనాళ్ల భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. అధికారం చేతిలో ఉందని.. కొందరు అక్రమంగా భూములు దోచుకున్నారని విమర్శించారు.
'అవన్ని పచ్చి అబద్ధాలు..'
రోష్ని చట్టంతో ఫరూక్ అబ్దుల్లా లబ్ధిపొందారన్న ఆరోపణలను ఎన్సీ ఖండించింది. అవన్ని అబద్ధాలని తేల్చిచెప్పింది. ద్వేషపూరిత ఉద్దేశంతో ఆరోపణలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. రోష్ని పథకాన్ని ఫరూక్ పొందలేదని.. శ్రీనగర్, జమ్ముల్లో ఉన్న ఆయన నివాసాలకు ఆ పథకంతో సంబంధం లేదని ట్వీట్ చేసింది.