ఎట్టకేలకు వివాదాస్పద ముమ్మారు తలాక్ బిల్లుకు మోక్షం లభించింది. ముస్లిం మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు.
చారిత్రక తప్పిదాన్ని పార్లమెంటు సరిచేసిందని ప్రధాని మోదీ కొనియాడారు. యావత్ భారతదేశమంతా ఈ విషయంపై ఎంతో సంతోషంగా ఉందన్నారు.
బిల్లుపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ముమ్మారు తలాక్‌ను నిషేధించి మోదీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని కొనియాడారు.
"ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎంతో అద్భుతమైన రోజు. ముస్లిం మహిళలకు ముమ్మారు తలాక్ నుంచి విముక్తి లభించింది. తన మాట నిలబెట్టుకున్న మోదీకి నా అభినందనలు. ఈ చారిత్రక బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రతి పార్టీకి నా ధన్యవాదాలు."
--- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం న్యాయం చేసిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ట్వీట్ చేశారు.
"ముస్లిం మహిళలకు న్యాయం చేసి... మోదీ ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. ఇకపై 'తలాక్-తలాక్-తలాక్' ఉండదు."
--- రవిశంకర్, న్యాయశాఖ మంత్రి.
ముస్లిం మహిళల ఆవేదనను మోదీ ఒక్కరే అర్థం చేసుకున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ముమ్మారు తలాక్ బిల్లుకు ఆమోదం లభించడంపై భాజపా సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.