- దేశంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంగా బిహార్ ఎందుకైంది?
- బిహార్‌కు ఐటీ కంపెనీలు ఎందుకు తీసుకురాలేదు?
- ఐటీ పార్కులు, సెజ్‌లు ఎందుకు నిర్మించలేదు?
- బిహార్ నుంచే ఎక్కువ మంది వలస కార్మికులు ఎందుకు ఉన్నారు?
మూడు దఫాలు బిహార్ సీఎంగా పని చేసి.. నాలుగోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నితీశ్‌కుమార్‌కు ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ సంధిస్తున్న ప్రశ్నలు ఇవి.
కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో దాడి చేస్తోంది. వీటిని దీటుగా ఎదుర్కొని... విజయ తీరాలకు చేరే లక్ష్యంతో ముందుకు సాగుతోంది అధికార జేడీయూ. ఇలాంటి వాడీవేడి ప్రశ్నలు, విమర్శలు, వ్యూహాలతో అంతకంతకూ మారుతోంది బిహార్ రాజకీయం.
అప్పుడు మిత్రులు.. ఇప్పుడు ప్రత్యర్థులు
అసెంబ్లీ ఎన్నికల వేళ.. బిహార్ రాజకీయాలు ప్రచార పర్వానికి చేరుకున్నాయి. గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కలిసి పోటీ చేసిన జేడీయూ, ఆర్జేడీ ఈసారి ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. తేజస్వీ యాదవ్ సారథ్యంలో ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆర్జేడీ.. నితీశ్ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. నిరుద్యోగం, అభివృద్ధి, మౌలిక వసతలు కల్పన, వలస కార్మికుల సమస్యలు లాంటి అంశాలపై విమర్శల దాడికి దిగుతోంది.
పారిశ్రామికీకరణ లేకపోవడాన్ని ప్రధాన సమస్యల్లో ఒకటిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు తేజస్వీయాదవ్.
వర్చువల్‌గా కాంగ్రెస్
బిహార్ రివల్యూషన్ మాస్ కాన్ఫరెన్స్ పేరుతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. వర్చువల్‌గా సదస్సులు నిర్వహిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతోంది. ప్రచారంలో భాగంగా ఇటీవల సమస్తిపుర్‌లో సమావేశం నిర్వహించింది. నిరుద్యోగ సమస్యే ప్రధానాంశంగా బిహార్ కాంగ్రెస్ చీఫ్ శక్తి సింగ్ గోహిల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అజయ్ కపూర్, తారిక్ అన్వర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్ ప్రసంగించారు.
మరో ఐదేళ్లు ఏడవాల్సిందే..
ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూడీఏ) కన్వీనర్, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో జేడీయూ సారథ్యంలో ఎన్డీఏ, ఆర్జేడీ నాయకత్వంలో మహాకూటమి ఏర్పడగా.. మూడో కూటమి కోసం యశ్వంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదు.