పంజాబ్‌లో దారుణం జరిగింది. పటియాలాలోని సబ్జీ మండీ ప్రాంతంలో పోలీసులపై నిహాంగ్‌లు(సంప్రదాయ ఆయుధాలు ధరించే సిక్కులు) దాడి చేశారు. కొందరు దుండగులు ఏఎస్ఐ హర్జీత్ సింగ్ చెయ్యి నరికేసినట్లు పోలీసులు తెలిపారు. మండీ బోర్డ్‌కు చెందిన పలువురు పోలీసులు సైతం గాయపడ్డట్లు వెల్లడించారు.
ఉదయం 6.15 గంటల సమయంలో ఓ వాహనంలో వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డట్లు పటియాలా పోలీస్ అధికారి మన్దీప్ సింగ్ సిద్ధు తెలిపారు. కూరగాయల మార్కెట్ వద్ద పోలీసులు ఆపినప్పుడు దాడి చేసినట్లు వివరించారు.
"వారిని కర్ఫ్యూ పాస్‌లు చూపించాలని అడిగాం. కానీ వారు ఆగకుండా అడ్డుగా ఉన్న బారికేడ్లను ఢీకొట్టారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ చెయ్యిని కత్తితో నరికారు. సర్దార్ పటియాలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సైతం ఈ దాడిలో గాయపడ్డాడు."-మన్దీప్ సింగ్ సిద్ధు, పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
అనంతరం నిహాంగీలు అక్కడి నుంచి పారిపోయినట్లు మన్దీప్ తెలిపారు. వారిని అరెస్టు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడ్డ హర్జీత్ సింగ్‌ను తొలుత స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర డీజీపీ దిన్కర్ గుప్తా స్పందించారు. తీవ్ర గాయాలపాలైన హర్జీత్ సింగ్‌కు వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు స్పష్టం చేశారు. నిందితులను సత్వరమే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పోలీస్ చెయ్యిని కత్తితో నరికిన దుండగులు