తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బడ్జెట్ 2019-20​ అంచనా: రూ. 27.86 లక్షల కోట్లు - అంచనాలు

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. రూ. 27 లక్షల 86 వేల 349 కోట్ల ఆదాయం-వ్యయ అంచనాలతో బడ్జెట్​ను రూపొందించింది కేంద్రం. ఇది గత ఏడాదితో పోలిస్తే.. 3 లక్షల 29 వేల 114 కోట్ల రూపాయలు అధికం.

బడ్జెట్ 2019-20​ అంచనా: రూ. 27.86 లక్షల కోట్లు

By

Published : Jul 6, 2019, 7:21 AM IST

Updated : Jul 6, 2019, 11:46 AM IST

నవభారత నిర్మాణమే ధ్యేయంగా.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. బడ్జెట్​ పరిమాణం ఘనంగానే ఉంది. గత ఏడాదితో పోలిస్తే 3 లక్షల 29 వేల 114 కోట్ల రూపాయలు అధికంగా వెచ్చించారు. ఈ సారి రూ. 27 లక్షల 86 వేల 349 కోట్ల అంచనాతో పద్దును ప్రవేశపెట్టారు.

ఇందులో రెవెన్యూ రాబడులు రూ. 19 లక్షల 62 వేల 761 కోట్లుగా పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. మూలధన రాబడులు 8 లక్షల 23 వేల 588 కోట్లుగా అంచనా వేశారు.

ద్రవ్యలోటు 7 లక్షల 3 వేల 760 కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి... ఇది జీడీపీలో 3.3 శాతంగా ఉంటుందన్నారు.

రెవెన్యూ రాబడుల్లో అత్యధికంగా ప్రతి రూపాయిలో 21 పైసలు కార్పొరేషన్​ పన్ను రూపంలో, రుణాలు, ఇతర మార్గాల్లో 20 పైసలు, జీఎస్టీ ద్వారా 19, ఆదాయపన్నుతో 16 పైసలు వస్తాయని అంచనా వేశారు.

రూపాయి వచ్చే మార్గాలు(పైసల్లో)..

  1. కార్పొరేట్​​ పన్ను- 21
  2. అప్పులు- 20
  3. జీఎస్టీ- 19
  4. ఆదాయపన్ను- 16
  5. పన్నేతర రాబడి- 09
  6. ఎక్సైజ్​ సుంకాలు- 08
  7. కస్టమ్స్​ సుంకం- 04
  8. రుణేతర మూలధన రాబడి- 03

రెవెన్యూ వ్యయానికి సంబంధించి పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద 23 పైసలు ఇస్తామని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్​. వడ్డీల చెల్లింపు కోసం 18 పైసలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 13, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రక్షణకు 9 పైసలు చొప్పున కేటాయించారు.

రాయితీలు, ఇతర ఖర్చుల కోసం 8 పైసలు చొప్పున.. ఆర్థిక సంఘం, ఇతర నిధుల బదిలీల కోసం 7 పైసలు, పెన్షన్ల కోసం 5 పైసలు వెళ్తాయని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి.

వివిధ రంగాలకు కేటాయింపులు...

రక్షణ రంగానికి..

రక్షణ శాఖకు ఈసారి పెద్దగా కేటాయింపులు పెంచలేదు. రూ. 2.98 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్​ను ఈ సారి రూ. 3.18 లక్షల కోట్లు చేశారు.

వ్యవసాయ రంగానికి..

రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు జరిపింది కేంద్రం. ఈ సారి రూ. 1.39 లక్షల కోట్లను ప్రతిపాదించారు.

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం కిసాన్​ సమ్మాన్​ నిధికి రూ. 75 వేల కోట్లను కేటాయించారు.

హోం శాఖకు..

కేంద్ర హోంశాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. గత బడ్జెట్​తో పోలిస్తే.. 5.17 శాతం నిధులు పెంచి.. రూ. 1, 19, 025 కోట్లు కేటాయించారు.

వైద్య, ఆరోగ్య శాఖ భారీగా...

గత రెండు బడ్జెట్లతో పోలిస్తే ఈ సారి వైద్య, ఆరోగ్య శాఖకు నిధులు ఎక్కువగా కేటాయించింది. ఈ సారి రూ. 62 వేల 659 కోట్ల 12 లక్షలు ప్రతిపాదించింది.

ఇందులో భాగంగా ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్​ భారత్​ కోసం రూ. 6 వేల 400 కోట్లు ఖర్చు చేయనున్నారు.

విద్యాశాఖకు 13 శాతం అధికం...

విద్యాశాఖకు గత ఏడాదితో పోలిస్తే 13 శాతం అధికంగా బడ్జెట్​ ప్రతిపాదించారు. ఈ సారి రూ. 94 వేల 853 కోట్ల 64 లక్షలు కేటాయించారు. ఇందులో స్టడీ ఇన్​ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థల ఏర్పాటుకు రూ. 400 కోట్లను కేటాయించారు.

48.2 శాతం పెరిగిన బొగ్గు శాఖ బడ్జెట్​..

గతేడాది బొగ్గు శాఖకు రూ. 781.85 కోట్లు కేటాయించిన కేంద్రం... ఈ సారి ఆ మొత్తాన్ని దాదాపు సగానికి పెంచింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1159.05 కోట్లు కేటాయించింది.

వివిధ కేటాయింపులు...

  • ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీకి రూ. 3.01 లక్షల కోట్లు కేటాయింపు
  • స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ. 29 వేల కోట్లు
  • సిబ్బంది మంత్రిత్వ శాఖకు రూ. 235 కోట్లు
  • పర్యాటకానికి రూ. 2,189 కోట్లు
  • జలశక్తి శాఖకు రూ. 28 వేల 261 కోట్లు కేటాయింపు
Last Updated : Jul 6, 2019, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details