దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కాజ్లో ఈ నెల 1 నుంచి 15 మధ్య జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో పలువురు కరోనాతో మరణించడం కలకలం సృష్టిస్తోంది. తబ్లిగ్-ఏ-జమాత్ అనే సంస్థ ఈ మత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో సుమారు 2000 మంది పాల్గొన్నట్లు సమాచారం. ఇదే ఇప్పడు అందరినీ కలవరపరుస్తోంది.
300 మందికి కరోనా!
నిజాముద్దీన్ ప్రాంతంలోని పలువురికి ఆదివారం రాత్రి నుంచి కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీనితో అప్రమత్తమైన పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు, వైద్య బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అనుమానితులను బస్సుల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు అధికారులు.
నిజాముద్దీన్ సమావేశానికి ఇండోనేసియా, మలేసియా, సౌదీ అరేబియా, కజకిస్థాన్ నుంచి ప్రతినిధులు వచ్చారు. మొత్తంగా 2000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. అక్కడే ఉన్న ఆరు అంతస్తుల డార్మిటరీలో 280 మంది విదేశీయులు ఉన్నట్లు తేలింది.
మొత్తం ప్రతినిధుల్లో 300 మందికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటి వరకు 175 మందికి పరీక్షలు నిర్వహించగా పలువురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరి ద్వారా ఇంకెవరికైనా కొవిడ్-19 సోకి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
కేసు నమోదు
అనారోగ్యంతో ఉన్న వారి గురించి ఆదివారమే అధికారులకు తెలిపినట్లు ప్రార్థనా స్థలం అధికార ప్రతినిధి చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానాపై కేసు నమోదు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. లాక్డౌన్ నిషేధాన్ని ఉల్లంఘించి, ఒకే చోట వందల మంది ఉన్నందుకు సంబంధిత సంస్థకు నోటీసు జారీ చేశారు.