74వ స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అభినందనీయమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని హోదాలో వరుసగా 7వ సారి మోదీ ప్రసంగించడంపై ప్రత్యేక అభినందనలు తెలిపారు.
"మోదీ ప్రసంగాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సమగ్ర దూరదృష్టితో చేసిన ప్రసంగం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. కరోనా మహమ్మారితో దేశం సమష్టిగా పోరాడగలదని, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించగలదనే విశ్వాసం నింపేలా ఉంది ఆయన ప్రసంగం. మనం ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించగలమని భరోసా ఇస్తోంది.
దీర్ఘకాలం ప్రధాని పదవిని చేపట్టిన 4వ వ్యక్తిగా మోదీ నిలిచినందుకు అభినందనలు. "
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
రక్షణ మంత్రి
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని కొనియాడారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ స్వావలంబన సాధించడానికి ఆయన ప్రసంగం స్ఫూర్తినిస్తుందన్నారు.
ప్రధాని భారత్ దశాదిశలు మార్చే ప్రసంగం చేశారన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తనదైన ముద్రను వేసేందుకు, ఆత్మనిర్భర్ భారత నిర్మాణానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.