తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫసల్‌ బీమా'లో మార్పులు... ఇచ్చేనా సాంత్వన?

2016 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కొత్త సవరణ ద్వారా ఇక నుంచి పీఎంఎఫ్‌బీవై పథకం కింద రుణాలు తీసుకునే రైతులు తమ పంటల్ని బీమా చేయించుకోవడం తప్పనిసరి.

By

Published : Mar 18, 2020, 6:47 AM IST

PMFBY: Govt approves changes in PMFBY to make it optional for farmers
'ఫసల్‌ బీమా'లో మార్పులు... ఇచ్చేనా సాంత్వన?

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకంలో తెచ్చిన కీలక మార్పుల్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పంటల బీమా పథకంలో లోపాల్ని సరిదిద్దే లక్ష్యంతోనే ఈ మార్పులను చేపట్టినట్లు తెలుస్తోంది. 2016 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమైన పీఎంఎఫ్‌బీవై పథకం కింద రుణాలు తీసుకునే రైతులు తమ పంటల్ని బీమా చేయించుకోవడం తప్పనిసరి. రైతులకు సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకంలో గతంలోనే పలు మార్పులు తీసుకొచ్చిన కేంద్ర సర్కారు తాజాగా 2020 ఫిబ్రవరి 19న మరోసారి పీఎంఎఫ్‌బీవై నిబంధనల్లో మార్పుల్ని ప్రకటించింది.

అందులో మొదటిది రుణగ్రహీతలు కాని రైతులు ఈ పథకంలో చేరడం ఐచ్ఛికమే. రెండోది, ప్రీమియం రాయితీపై పరిమితులు విధించడం. సాగునీరు అందని ప్రాంతాలు, పంటలకు 30 శాతం ప్రీమియం రాయితీపై పరిమితి విధించగా, సాగునీరు అందే ప్రాంతాలు, పంటలకు 25 శాతం ప్రీమియం రాయితీపై పరిమితి విధించింది. ఈ రెండు నిర్ణయాలు పథకంపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. రుణాలు తీసుకోని రైతులకు పీఎంఎఫ్‌బీవైని ఐచ్ఛికంగా మార్చడం వల్ల (రుణాలు పొందే రైతులకు ఇప్పటికే తప్పనిసరి) ఈ పథకాన్ని ఎంచుకునే రైతుల సంఖ్య తగ్గుతుందని బీమా కంపెనీల నిపుణులు భావిస్తున్నారు. పంటలపరంగా నిజంగా కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారే పథకంలో నమోదవుతారని చెబుతున్నారు.

రుణమాఫీ పథకాలే కారణం...

ఈ తరహా నిబంధనల వల్ల పథకం పరిధిలోకి వచ్చే ప్రాంతం కూడా తగ్గే అవకాశం ఉంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల అంచనా ప్రకారం పీఎంఎఫ్‌బీవై పరిధిలోకి వచ్చే ప్రాంతంలో 10 నుంచి 20 శాతం తగ్గినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎన్నో ప్రోత్సాహకాల్ని అందించినా, ఈ పథకం ప్రారంభించిన 2016 నుంచి పంట బీమా పరిధిలోకి వచ్చే ప్రాంతం- 22 శాతం నుంచి 30 శాతానికే పెరిగింది. అంతేకాకుండా, 2020 ఖరీఫ్‌ నుంచి ఈ పథకం కింద నమోదైన మొత్తం రైతుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. 2016 ఖరీఫ్‌ నుంచి 2018 మధ్య ఈ పథకంలో నమోదైన రైతుల సంఖ్య 14 శాతం వరకు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రైతుల నమోదు తగ్గిపోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రుణమాఫీ పథకాలే కారణం కాగా, ఆధార్‌తో అనుసంధానించాలనే నిర్ణయం వల్ల సరైన పత్రాలు లేనివారు పథకంలోకి చొరబడకుండా దూరంగా ఉండటం కూడా సంఖ్య తగ్గడానికి కారణమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకంలో కొద్దిమంది రైతులే చేరడం వల్ల పీఎంఎఫ్‌బీవై కింద చెల్లించాల్సిన ప్రీమియం (యాక్చూరియల్‌) గత కొన్నేళ్లుగా యాసంగి (వేసవి) పంటలకు పన్నెండు శాతానికి, వర్షాకాలం (ఖరీఫ్‌) పంటలకు పద్నాలుగు శాతానికి పెరిగింది. ప్రస్తుతం కొద్దిమంది రైతులే ఈ పథకాన్ని ఎంచుకున్నా, ఈ ప్రీమియం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాయితీపై విధించిన పరిమితి నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది.

24 శాతం ప్రీమియం రాష్ట్రాలదే బాధ్యత...

రాబోయే ఖరీఫ్‌ నుంచి ఈ తరహా ప్రీమియంలో రైతుల వాటా రెండు శాతంగానే ఉంటుంది. కేంద్రం తన వాటా కింద 30 శాతం వరకే రాయితీని భరించే అవకాశం ఉంది. అంటే సగం సగం నిష్పత్తిలో 14 శాతమే అవుతుంది. మిగతా, 24 శాతం ప్రీమియం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఏదైనా రాష్ట్రం ఇలాంటి అదనపు భారాన్ని మోయకూడదని భావిస్తే, రైతులు బీమా పరిధిలోకి వచ్చే అవకాశం ఉండదు. పంటలు దెబ్బతిన్నప్పుడు రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద పంట నష్టానికి ఇచ్చే పరిహారంపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీనివల్ల ఈ పథకం ఆశయానికి గండిపడే అవకాశం ఉంది. పంట నష్టం జరిగినప్పుడు పీఎంఎఫ్‌బీవై కింద దక్కే పరిహారంతో పోలిస్తే, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద నష్టపరిహారం చాలా తక్కువే.

పంట బీమానే కీలకం...

వ్యవసాయం, తోటలసాగు, వార్షిక ప్లాంటేషన్‌ పంటలకు నష్టపరిహారం చిన్నకారు, సన్నకారు రైతులకు నష్టపరిహారం సాగునీరు లేని ప్రాంతంలో ప్రతి హెక్టారుకు రూ.6,800, సాగునీరుండే ప్రాంతంలో ప్రతి హెక్టారుకు రూ.13,500 ఇస్తారు. రెండు హెక్టార్లకు మించి భూమి ఉండే రైతులకూ సహాయాన్ని రెండు హెక్టార్లకే పరిమితం చేశారు. ఈ క్రమంలో పంట బీమా లేకపోతే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రైతులు చాలా తక్కువ మొత్తమే అందుకుంటారు. మొత్తానికి ఇలాంటి చర్యలు పీఎంఎఫ్‌బీవై పథకం మనుగడపై ఏ తరహా మార్పుల్ని చూపుతాయో రాబోయే కాలంలో నిశితంగా పరిశీలించాల్సి ఉంది.

- పరిటాల పురుషోత్తం (రచయిత- సామాజిక ఆర్థిక విశ్లేషకులు)

ABOUT THE AUTHOR

...view details